కార్మికులను కాటేసిన కరెంట్
కుత్బుల్లాపూర్: షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పేట్ బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రహ్లాద్(25), అంగద్(28), ధ్రువ్ సహానీ(25), అమర్నాథ్ సహానీ(25)లు కాంట్రాక్టర్ అర్జున్ గుప్తా ద్వారా మేడ్చల్ గుండ్లపోచంపల్లి పరిధిలోని ఎస్కే గుప్తా గోదామ్‌లో పెయిం టింగ్ వేసే పనికి కుదిరారు. తోటి కార్మికులతో కలిసి సోమవారం సాయంత్రం వరకు గోడలకు పెయింటింగ్ వేసిన నలుగురూ గోదామ్ ఆవరణలో తాముంటు న్న రేకుల షెడ్డులో రాత్రి నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున 4 గం టలకు షార్ట్ సర్క్యూట్ కావడంతో వీరు నిద్రిస్తున్న షెడ్డుకు మొత్తం విద్యుత్ సరఫరా అయింది. ఇది గమనించిన ధ్రువ్ సహానీ, అమర్నాథ్ సహానీ సమయస్ఫూర్తితో బయట పడి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రహ్లాద్, అంగద్ ఒకేసారి డోర్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించడంతో రేకులు తగిలి షాక్‌కు గురై క్షణాల్లో ప్రాణం విడిచారు.
యాజమాన్యం నిర్లక్ష్యం...
ఘటనలో యాజమాన్య నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. రేకుల షెడ్డులో నివాసాన్ని ఏర్పాటు చేసి అందులో కార్మికులను పడుకోబెట్టడం విమర్శలకు తావిస్తోంది. సర్కిల్ బ్రేకర్స్ లోపల షార్ట్ సర్క్యూట్ కావడం.. వాటికి దగ్గరగా రేకులు ఉండడం వల్ల అంతా విద్యుత్ వ్యాపించిందని ఘటనా స్థలాన్ని సందర్శించిన మేడ్చల్ విద్యుత్ ఏఈ హలీముద్దీన్ ‘సాక్షి’తో అన్నారు.
దిక్కుతోచని స్థితిలో సహచరులు..
ఉత్తర్‌ప్రదేశ్ నుంచి జీవనోపాధి కోసం వచ్చిన నలుగురిలో ఇద్దరు మృత్యువాత పడటంతో మిగతా ఇద్దరూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరిని పనిలో పెట్టిన కాంట్రాక్టర్ స్థానికంగా లేకపోవడంతో తోటి కార్మికులు వీరికి అండగా నిలిచారు. యాజమాన్యం మధ్యాహ్న సమయంలో రెండు అంబులెన్స్‌ల్లో మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేయగా విగత జీవులుగా మారిన వారిని చూసి తోటి కార్మికులు బోరుమన్నారు.