ట్రంప్‌కు నిరసనల సెగ
ప్రతి సభలోనూ ఆందోళనకారుల అలజడి
వారిని జైల్లో పెట్టాలన్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ టికెట్ రేసులో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను నిరసనలు వెంటాడుతున్నాయి. ఎన్నికల ప్రచార చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నిరసనలు ఎదురవుతున్నాయి. షికాగో ర్యాలీతో మొదలైన ఆందోళనకారుల నిరసన శనివారమూ కొనసాగింది. ఒహాయోలోని డేటన్లో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ ఆందోళనకారుడు బారికేడ్లు దూకి వేదిక వద్దకు వచ్చేందుకు ప్రయత్నించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అడ్డుకుని ట్రంప్‌కు రక్షణ కల్పించారు. ట్రంప్ అతనిపై నోరు పారేసుకున్నారు. ‘ఆ వ్యక్తి ఉగ్రవాది అయి ఉండొచ్చు. ఐసిస్ మద్దతుదారైనా అయి ఉండొచ్చు. అతన్ని జైల్లో పెట్టాలి. మన కోర్టులు అతన్ని అంత తేలిగ్గా వదలవని అనుకుంటున్నా’ అని అన్నారు. అనంతరం మిస్సోరీలోని కాన్సాస్‌లో మూడు సభల్లోనూ నిరసనకారులు ట్రంప్ ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకున్నారు. ట్రంప్ స్పందిస్తూ ‘వారు చెడ్డవాళ్లు, దేశానికి కీడు చేసేవాళ్లు, వాళ్లని జైల్లో పెట్టాలి’ అని విరుచుకు పడ్డారు. ప్రసంగాన్ని అడ్డుకున్న మహిళను అరెస్టు చేయాలని పోలీసులకు సూచించారు. కాగా, టికెట్ రేసుకు సంబంధించి వాషింగ్టన్, వ్యోమింగ్ ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థులైన రూబియో, కాషిష్ల చేతిలో ఓడిపోయారు.
చైనా సూట్లు ధరిస్తూ వారిపై విమర్శలా..?
చైనీస్, భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలు లాక్కొంటున్నారని విమర్శలు గుప్పించే ట్రంప్ చైనాలో తయారైన షర్ట్లు, టైలు ధరిస్తారని అమెరికా మీడియా వెల్లడించింది.