మహా పుష్కరాలపై పిల్ కొట్టివేత
హైదరాబాద్ : మహా పుష్కరాల పేరుతో ఇరు తెలుగు రాష్ట్రాలూ కూడా ఓ మతానికి చెందిన కార్యక్రమాలనే విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని, ఇది లౌకిక స్ఫూర్తికి విరుద్ధమంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పుష్కరాల కోసం ప్రభుత్వాలు చేస్తోంది ప్రచారం ఎంత మాత్రం కాదని, ప్రజలకు కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాయని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల బాధ్యతని తేల్చి చెప్పింది. పుష్కరాల ద్వారా ప్రభుత్వాలు కేవలం ఓ మతాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నాయన్న వాదనలతో ఏ మాత్రం అర్థం లేదని ధర్మాసనం తెలిపింది.
మహాపుష్కరాలకు ప్రచారం చేయడం లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని ప్రకటించాలని, రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడినే బాధ్యుడిగా చేయాలంటూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, ప్రజల డబ్బుతో ప్రభుత్వాలు ఈ విధంగా ఓ మతపరమైన కార్యక్రమాలకు ప్రచారం చేయడం లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. గోదావరి నదిలో స్నానమాచరిస్తే పుణ్యం, మోక్షం కలుగుతోదంటూ పత్రికలు, టీవీల ద్వారా ఇరు ప్రభుత్వాలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయని, ఇది ఎంత మాత్రం సరికాదని ఆయన వివరించారు.