Petroleum Minister Dharmendra Pradhan
-
‘పెట్రో’ పరిష్కారంపై చర్చిస్తున్నాం
భువనేశ్వర్/ముంబై: పెట్రో ధరలు పెరగడంపై సత్వరమే ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు యత్నిస్తున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పెట్రో బాదుడు నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే విషయమై ప్రభుత్వం విస్తృతంగా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం ఆయన భువనేశ్వర్‌లో మాట్లాడారు. ‘పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించేందుకు వీటిని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని పెట్రోలియం శాఖ యోచిస్తోంది. జీఎస్టీ పరిధిలోకి తెచ్చేలోపు ఈ సమస్యకు వెంటనే ఓ పరిష్కారం కనుగొనడంపై కేంద్రం చర్చిస్తోంది. పెట్రో ఉత్పత్తుల ధరల నియంత్రణలో కేంద్రంతో పాటు రాష్ట్రాల పాత్ర ఉంది’ అని అన్నారు. పెట్రో సమస్యపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్, వెనిజువెలా దేశాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్లే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయన్నారు. ప్రజలపై పెట్రోబాదుడుకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్, అమ్మకపు పన్నుల్ని రాష్ట్రాలు తగ్గించాలని నీతిఆయోగ్ సూచించింది. ఆర్థికలోటును కట్టడిచేయడం, ముడిచమురు ధరల ప్రభావాన్ని ఎదుర్కోవడం వంటి కీలక బాధ్యతలు కేంద్రంపై ఉన్నందున ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం వీలుకాదని స్పష్టంచేసింది. -
తెలంగాణలో సీఎన్జీ స్టేషన్లు నెలకొల్పండి
పెట్రోలియం మంత్రికి దత్తాత్రేయ వినతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు గ్యాస్ కనెక్షన్లు పెంచాలని, సీఎన్జీ స్టేషన్లు ఏర్పా టు చేయాలని పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం తన కార్యాలయానికి వచ్చి భేటీ అయిన సందర్భంలో దత్తాత్రేయ ఈ విషయాలను చర్చించారు. హైదరాబాద్ నగరంలో సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ ఔట్లెట్లు ఏర్పాటు చేయాలని, నేదునూరు, శంకరపల్లిల్లో ప్రతిపాదిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు గ్యాస్ కేటాయించాలని కోరారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ, ‘భాగ్యనగర్ గ్యాస్’ పేరుతో హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న సీఎన్జీ స్టేషన్లకు గ్యాస్ పెంపు, స్టేషన్ల పెంపుపై అధికారులతో చర్చిస్తామన్నారు.