రేపట్నుంచి పెట్రోల్ బంకుల నిరవధిక బంద్
- పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణస్పష్టీకరణ
గుంటూరు వెస్ట్/సాక్షి, హైదరాబాద్/సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ ఒకటోతేదీ ఉదయం ఆరు గంటల నుంచి పెట్రోలు బంకులు నిరవధికంగా మూతపడనున్నాయి. డీజిల్, పెట్రోలుపై లీటరుకు రూ.4 చొప్పున అదనంగా పెంచిన వ్యాట్‌ను రద్దు చేయాలని కోరుతూ పెట్రోల్ బంకుల నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.గోపాలకృష్ణ మంగళవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు అక్టోబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక రవాణా బంద్ చేపడుతున్నట్టు, ఇందులో భాగంగా మన రాష్ట్రంలోని సరుకు రవాణా వాహనాలు, పెట్రోలు, డీజిల్ రవాణా వాహనాలు, పెట్రోలు బంకుల కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.