Pew Research Centre
-
‘జిన్‌పింగ్‌ను అంతగా విశ్వసించలేం’!
వాషింగ్టన్: గత ఏడాది కాలంగా చైనా వ్యవహారశైలి పట్ల ప్రపంచ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. జూన్ 10 నుంచి ఆగష్టు 3 వరకు సుమారు 14 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు మంగళవారం నాటి నివేదికలో పేర్కొంది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, దక్షిణ కొరియా, స్పెయిన్, కెనడా, బ్రిటన్, డెన్మార్క్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ తదితర దేశాల్లోని 14 వేల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను టెలిఫోనిక్ సంభాషణ ద్వారా సేకరించినట్లు పేర్కొంది. వీరిలో అత్యధికులు కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా చైనా పట్ల ప్రతికూల భావనలు కలిగి ఉన్నారని తెలిపింది.(చదవండి: చైనాయే లక్ష్యంగా క్వాడ్ దేశాల ప్రకటన) ఈ క్రమంలో మహమ్మారి వ్యాప్తి కట్టడిలో డ్రాగన్ దేశం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని 61 శాతం మంది అభిప్రాయపడగా, 37 శాతం మంది మాత్రం ఈ విషయంలో చైనాకు మంచి మార్కులే వేశారని, మిగిలిన వారు తటస్థంగా ఉన్నారని వెల్లడించింది. ఇక కోవిడ్-19 అత్యంత ప్రభావిత దేశాల్లో ఒకటైన అమెరికాలో ఏకంగా 84 శాతం మంది చైనా తీరుపై అసహనం వ్యక్తం చేశారని, కరోనా వ్యాప్తి నియంత్రణలో డ్రాగన్ దేశం విఫలమైందని అభిప్రాయపడినట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ పేర్కొంది. జిన్‌పింగ్‌ను అంతగా విశ్వసించలేం ఇక 14 దేశాల్లో సర్వేలో పాల్గొన్న 78 శాతం మంది ప్రజలు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నాయకత్వంపై సందేహాలు వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో సంబంధాల విషయంలో ఆయనను పూర్తిగా విశ్వసించలేమని స్పష్టం చేశారు. మరో 10 శాతం మంది జిన్‌పింగ్ నమ్మదగ్గ నాయకుడేనని పేర్కొన్నారు. అయితే జర్మనీలో మాత్రం ఈ కేటగిరీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే జిన్‌పింగ్‌కే ఎక్కువ ఓట్లు పడటం విశేషం. అక్కడ 78 శాతం ప్రజలు జిన్‌పింగ్‌పై నమ్మకం లేదని చెప్పగా, 89 శాతం మంది ట్రంప్ పట్ల ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మెజారిటీ దేశాల ప్రజలు కరోనా సంక్షోభంలోనూ అమెరికానే అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచిందంటూ ట్రంప్ పాలనపై విశ్వాసం వ్యక్తం చేశారు. -
కలిసి ఉంటే కలదు సుఖం
కలిసి ఉంటే కలదు సుఖం అనే రీతిలో ప్రపంచవ్యాప్తంగా హిందూ కుటుంబాలు ఉమ్మడిగానే ఉంటున్నాయని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంటున్న హిందూ కుటుంబాల్లో 55 శాతం కుటుంబాలు కలిసి ఉంటున్నాయని ఆ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. ఆ తర్వాత బౌద్ధులు 44 శాతం, ముస్లింలు 36 శాతం, క్రిస్టియన్లు 29 శాతం ఉమ్మడి కుటుంబాలుగానే ఉంటున్నారని తేలింది. ‘రెలిజియన్ అండ్ లివింగ్ అరేంజ్మెంట్ అరౌండ్ ద వరల్డ్’పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో సంపన్న దేశాల్లో నివసించే కుటుంబాలు చిన్నవిగానే ఉంటున్నాయని, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రం పెద్ద కుటుంబాలుగా జీవిస్తున్నారని వెల్లడించింది. – సాక్షి, హైదరాబాద్ అక్కడ చిన్న కుటుంబాలే ప్రపంచంలోని ప్రతి 10 మంది క్రిస్టియన్ కుటుంబాల్లో ఆరు కుటుంబాలు అమెరికా, యూరోప్‌లోనే ఉన్నాయని, ఆయా దేశాల్లో చిన్న కుటుంబాల వ్యవస్థ వైపే మొగ్గుచూపుతున్నారని ప్యూ తన అధికారిక వెబ్సైట్లో ఇటీవలే ఉంచిన సర్వే నివేదికలో పేర్కొంది. ప్రపంచంలోని ప్రతి 10 హిందూ కుటుంబాల్లో 9 కుటుంబాలుండే భారత్‌లో తొలి నుంచి వస్తున్న సంప్రదాయాలకు లోబడి కలిసే ఉంటున్నారని తెలిపింది. ప్రపంచంలోని 130 దేశాల డాటా ఆధారంగా జర్మనీలో అతి తక్కువగా సగటున 2.7 మంది ప్రతి కుటుంబంలో ఉంటున్నారని వెల్లడించింది. అదే గాంబియా దేశంలో అతి ఎక్కువగా 13.8 మంది సభ్యులు ఒక్కో కుటుంబంలో ఉన్నారని తెలిపింది. ఒంటరి జీవులు 4 శాతం ఇక, ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 శాతం మంది మాత్రమే ఒంటరిగా జీవిస్తున్నారని సర్వే తేల్చింది. అందులో యూదులు (10 శాతం), బౌద్ధులు (7 శాతం), ఏ మతమూ చెప్పనివారు (7 శాతం) ఉన్నారని, హిందూ, ముస్లిం మతస్తుల్లో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఒంటరిగా జీవిస్తున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లోని వివిధ ప్రభుత్వ సంస్థల వివరాలు, జనాభా గణన లెక్కల ఆధారంగా 2010 నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ సర్వే వివరాలను క్రోడీకరించినట్టు ప్యూ సంస్థ వెల్లడించింది. -
ఫేస్ బుక్కే టాప్!
వాషింగ్టన్: సామాజిక మాధ్యమంలో అగ్రస్థానం ఫేస్ బుక్ దేనని తాజా సర్వేలో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫేస్ బుక్ చూడడానికే మక్కువ చూపుతున్నారని తేలింది. ఫేస్ బుక్ కు ఆదరణ నానాటికీ పెరుగుతోందని అమెరికాకు చెందిన పీ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. 2014 సంవత్సరానికి గానూ 1,597 ఇంటర్నెట్ వినియోగదారులతో ఈ సర్వే నిర్వహించింది. అమెరికా పెద్దల్లో 71 శాతం మంది ఫేస్బుక్ చూడడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 2013లో ఇది 63 శాతంగా ఉందని ఫోర్బ్స్ మేగజీన్ వెల్లడించింది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 45 శాతం మంది రోజులో పలుమార్లు ఫేస్ బుక్ చూస్తున్నట్టు కూడా సర్వే తేటతెల్లం చేసింది. ఇక ట్విటర్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. -
ఆన్లైన్ లో వేధింపులు మామూలే!
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఆన్లైన్ లో వేధింపులు సర్వసాధామణట. ఆన్లైన్ జీవితంలో వేధింపులు మామూలు విషయంగా మారిందని ఓ సర్వేలో వెల్లడైంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్న అమెరికా పౌరుల్లో మూడో వంతు వేధింపులు బారిన పడినవారేనని ప్యు రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొన్నామని సర్వేలో 40 శాతం మంది తెలిపారు. శారీరక, లైంగిక వేధింపులకు గురైయ్యామని వెల్లడించారు. అయితే వీరిలో సగం మంది తమను ఎవరో వేధిస్తున్నారో తెలుసుకోలేకపోయారు. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్ లో పెట్టినవారు, ఐటీ రంగంలో పనిచేసేవారు వేధింపులకు బాధితులవుతున్నారు. సెలబ్రిటీలకు ఆన్లైన్ వేధింపులు తప్పడం లేదని సర్వేలో వెల్లడైంది. హాలీవుడ్ తారలు జెనిఫర్ లారెన్స్, వెనిసా హడ్జన్స్, అప్టన్ తదితరుల నగ్న ఫొటోలను దొంగిలించి ఆన్ లైన్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.