కలిసి ఉంటే కలదు సుఖం అనే రీతిలో ప్రపంచవ్యాప్తంగా హిందూ కుటుంబాలు ఉమ్మడిగానే ఉంటున్నాయని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉంటున్న హిందూ కుటుంబాల్లో 55 శాతం కుటుంబాలు కలిసి ఉంటున్నాయని ఆ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. ఆ తర్వాత బౌద్ధులు 44 శాతం, ముస్లింలు 36 శాతం, క్రిస్టియన్లు 29 శాతం ఉమ్మడి కుటుంబాలుగానే ఉంటున్నారని తేలింది. ‘రెలిజియన్ అండ్ లివింగ్ అరేంజ్‌మెంట్ అరౌండ్ ద వరల్డ్’పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో సంపన్న దేశాల్లో నివసించే కుటుంబాలు చిన్నవిగానే ఉంటున్నాయని, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రం పెద్ద కుటుంబాలుగా జీవిస్తున్నారని వెల్లడించింది.
– సాక్షి, హైదరాబాద్
అక్కడ చిన్న కుటుంబాలే
ప్రపంచంలోని ప్రతి 10 మంది క్రిస్టియన్ కుటుంబాల్లో ఆరు కుటుంబాలు అమెరికా, యూరోప్‌లోనే ఉన్నాయని, ఆయా దేశాల్లో చిన్న కుటుంబాల వ్యవస్థ వైపే మొగ్గుచూపుతున్నారని ప్యూ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇటీవలే ఉంచిన సర్వే నివేదికలో పేర్కొంది. ప్రపంచంలోని ప్రతి 10 హిందూ కుటుంబాల్లో 9 కుటుంబాలుండే భారత్‌లో తొలి నుంచి వస్తున్న సంప్రదాయాలకు లోబడి కలిసే ఉంటున్నారని తెలిపింది. ప్రపంచంలోని 130 దేశాల డాటా ఆధారంగా జర్మనీలో అతి తక్కువగా సగటున 2.7 మంది ప్రతి కుటుంబంలో ఉంటున్నారని వెల్లడించింది. అదే గాంబియా దేశంలో అతి ఎక్కువగా 13.8 మంది సభ్యులు ఒక్కో కుటుంబంలో ఉన్నారని తెలిపింది.
ఒంటరి జీవులు 4 శాతం
ఇక, ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 శాతం మంది మాత్రమే ఒంటరిగా జీవిస్తున్నారని సర్వే తేల్చింది. అందులో యూదులు (10 శాతం), బౌద్ధులు (7 శాతం), ఏ మతమూ చెప్పనివారు (7 శాతం) ఉన్నారని, హిందూ, ముస్లిం మతస్తుల్లో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఒంటరిగా జీవిస్తున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లోని వివిధ ప్రభుత్వ సంస్థల వివరాలు, జనాభా గణన లెక్కల ఆధారంగా 2010 నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ సర్వే వివరాలను క్రోడీకరించినట్టు ప్యూ సంస్థ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment