ఇక ఎన్టీఆర్ వర్సిటీలో డిజిటల్ మూల్యాంకనం
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇక నుంచి డిజిటల్ మూల్యాంకనం జరగనుంది. తొలివిడత పీజీ మెడికల్ పరీక్ష జవాబు పత్రాల దిద్దివేతలో ఈ పద్ధతి అనుసరించేందుకు వర్సిటీ పాలకమండలి ఆమోదం తెలిపింది. వర్సిటీలో వైస్ చాన్స్‌లర్ టి.రవిరాజు అధ్యక్షతన సోమవారం పాలకమండలి సమావేశం జరిగింది. వైద్య ప్రమాణాలు మరింత పెంచేందుకు సమావేశంలో నిర్ణయించారు. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
బెంగళూరు రాజీవ్‌గాంధీ హెల్త్ వర్సిటీలో మాదిరి ఎన్టీఆర్ వర్సిటీలోనూ అన్ని కోర్సులకూ డిజిటల్ మూల్యాంకనం అమలు చేసేందుకు కసరత్తు చేయాలని తీర్మానించారు. తొలుత పీజీ మెడికల్ పరీక్షలకు డిజిటల్ మూల్యాంకనం చేయనున్నారు. అలాగే వర్సిటీ ప్రాంగణంలోని సిల్వర్‌జూబ్లీ బిల్డింగ్‌పై రూ.1.25 కోట్లతో మరో అంతస్తు నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది. సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎక్స్ అఫీషియో సభ్యులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.