‘పీజీమెట్’ రీఎగ్జామ్‌పై నేడు విచారణ
* పాత ర్యాంకులనే పరిగణనలోకి తీసుకొనేలా ఆదేశాలివ్వండి
* హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై వైద్య విద్యార్థుల అప్పీల్
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీ మెట్)ను తిరిగి నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ గత నెల 25న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు వైద్య విద్యార్థులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఏప్రిల్ 27న నిర్వహించిన పీజీమెట్‌కు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసి, మార్చి 2న నిర్వహించిన పీజీమెట్ ర్యాంకులు పరిగణనలోకి తీసుకుని వాటి ఆధారంగా తమను కౌన్సెలింగ్‌కు పిలిచేలా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించాలని కోరుతూ డాక్టర్ విక్రంరెడ్డితో పాటు మరో 63 మంది విద్యార్థులు ఈ రిట్ అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే పరీక్ష తిరిగి నిర్వహించాలన్న ప్రభుత్వ జీవోను సమర్థించారని, ఇది ఎంత మాత్రం సరికాదని పిటిషనర్లు తమ అప్పీల్లో పేర్కొన్నారు. అంతేకాక సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ప్రశ్నపత్రం లీక్ అయ్యిందే తప్ప, తమ వల్ల కాదని, దానికి తమను బలి చేయడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. మార్చిలో జరిగిన పీజీమెట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, ఈసారి ఆ స్థాయిలో ర్యాంకులు సాధించలేకపోయారని, ఇందులో కొంత మందికి ప్రవేశం లభించే అవకాశం కూడా లేదని వారు తెలిపారు. ఈ అప్పీల్‌ను గురువారం జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది.