కడప అంటే కడుపు మంట!
సాక్షి ప్రతినిధి, కడప:
వైఎస్పార్ జిల్లాకు ఎంత చేసినా తమ పార్టీకి ఉపయోగం లేదనుకున్నారో ఏమో... ఏదైతేనేం నాటి సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు వైఎస్సార్ జిల్లా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. జిల్లా పారిశ్రామికాభివద్ధికి కిరణ్ నేతత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డుపెట్టింది. బీడీఎల్ నుంచి ఫార్మా కంపెనీల వరకూ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని కంపెనీలు ముందుకు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు.
దాంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కలలుకన్న ‘కొప్పర్తి పారిశ్రామికవాడ’ కలగానే మిగిలిపోయింది. కడప గడపలో డీఆర్డీఓ నెలకొల్పుతామని ముందుకొచ్చినా సీఎం చంద్రబాబు చిత్తూరుకు తరలించుకెళ్లారు. ఓట్లు-సీట్లు ఆధారంగా నిర్ణయాలు, పర్యటనలు ఖరారవుతున్నాయి. కడప అంటేనే కడపుమంట స్పష్టంగా కన్పిస్తోంది. తుదకు జిల్లాల పర్యటనలోనూ చిట్టచివర్న వైఎస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పర్యటిస్తున్నారు.
వైఎస్ కృషికి తూట్లు...
ఆయా ప్రాంతాల సమగ్రాభివద్ధికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు రెండుకళ్లు లాంటివి. వ్యవసాయరంగం అభివద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అపార కషి చేశారు. సమగ్రాభివద్ధి కోసం పారిశ్రామిక ప్రగతిపై దష్టి సారించారు. అందుకోసం జిల్లా కేంద్రమైన కడప నగరానికి సమీపంలో 6,464.5 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది.
ఈ పారిశ్రామిక వాడకు ‘సోమశిల మంచినీటి పథకం’ ద్వారా నీరందించేలా ప్రభుత్వం ప్రణాళిక రచించింది. వైఎస్ మరణానంతరం వచ్చిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు వివక్ష ప్రదర్శించాయి. ఆ పథకాన్ని పట్టించుకోలేదు. అదేబాటలో ప్రస్తుత తెలుగుదేశం పయనిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉక్కు పరిశ్రమ ఊసేలేదు
వైఎస్సార్ జిల్లాలో రూ. 20వేల కోట్లు వ్యయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమందికి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో బ్రహ్మణి ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ పరిశ్రమకు రాజకీయ కోణం ముడిపెట్టి గ్రహణం పట్టించి చివరకు రద్దు చేశారు. ఆస్థానంలో సెయిల్ నేతత్వంలో ఉక్కుపరిశ్రమ నెలకొల్పాలని ప్రజలు, వివిధ పార్టీలు ఉద్యమం చేపట్టినా.
నిష్ర్పయోజనమే అయ్యింది. గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ (జీఓఎం) నిర్ణయంలో పేర్కొన్న ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తడం లేదు. ఎయిర్ పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా నేతత్వంలో కడప గడపలో పూర్తిచేసిన విమానాశ్రయాన్ని సైతం ప్రారంభించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అలాగే కడప కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనాలు 95శాతం పూర్తి అయ్యాయి. తక్కిన పనుల పట్ల ఎంతకాలమైనా శ్రద్ధ చూపడం లేదు.