మందుల దుకాణం.. అక్రమార్కుల మకాం!
ఇష్టారాజ్యంగాషాపుల నిర్వహణ
ఫార్మాసిస్టులు లేనిదుకాణాలే ఎక్కువ
మందుల చీటీ లేకుండానే విక్రయాలు
కొరవడిన పర్యవేక్షణ
సంగారెడ్డి క్రైం:
జిల్లాలో మందుల దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా తయారైంది. డబ్బే పరమావధిగా అక్రమార్కులు మందుల దుకాణాల్లో తిష్టవేస్తున్నారు. ఏ మాత్రం అవగాహన లేనివారు మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దుకాణం నిర్వహించే వ్యక్తి ఫార్మాసిస్టు అయి ఉండాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. అంతేగాక.. కనీసం ఇంటర్మీడియెట్ స్థాయి వరకు చదివిన వారైనా ఉండకపోవడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే మందుల దుకాణాదారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ ధ్రువీకరించిన మందుల చీటీ ఉంటేనే మందులు ఇవ్వాల్సి
ఉంటుంది. కానీ ఎటువంటి చీటీ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 3,800 మెడికల్ దుకాణాలున్నాయి. ఇందులో 30 హోల్సేల్ కాగా, ఆస్పత్రులకు అనుసంధానమైనవి వెయ్యి, గ్రామాల్లో 900 దుకాణాలు ఉన్నాయి. దాదాపు 80 శాతం వరకు ఫార్మాసిస్టులు లేని దుకాణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఎక్కడైనా ఆస్పత్రి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారంటే దానికి అనుసంధానంగా మందుల దుకాణం పెట్టడానికి పోటీ విపరీతంగా ఉంటుంది.
ఇటీవల జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో కొత్తగా ఏర్పాటు చేసిన కొన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మందుల దుకాణం మేం పెడతామంటే...మేం పెడతామని అనేక మంది లక్షల రూపాయలు గుడ్విల్గా ఇచ్చేందుకు సైతం పోటీగా ముందుకు వచ్చారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. చివరకు ఆయా ఆస్పత్రి వర్గాలే సొంతంగా మెడికల్ షాపులను నెలకొల్పాయి. అయితే విడిగా నిర్వహిస్తున్న మందుల దుకాణాల్లో ఫార్మాసిస్టే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. దుకాణం నిర్వహిస్తున్న సమయాల్లో ఆయన పర్యవేక్షణలోనే మందుల విక్రయాలు జరగాలి. కానీ అనేక రిటైల్ దుకాణాల్లో ఫార్మాసిస్టు అందుబాటులో ఉండటం లేదు. పట్టణాల్లోనే ఫార్మాసిస్టు లేకుండా విక్రయాలు కొనసాగుతుంటే ఇక గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. గ్రామాల్లో ఎలాంటి ఫార్మాసిస్టు ధ్రువపత్రం లేకుండానే మందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇతరుల సర్టిఫికెట్లను అద్దెకు తెచ్చుకుని దుకాణాలను నడుపుతున్నారు. ఎంబీబీఎస్ వైద్యులు సిఫార్సు చేసిన మందుల చీటీ ఆధారంగానే జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న రోగాలకు సైతం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చిన్న పిల్లలు వెళ్లి అడిగినా మందు బిళ్లలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే డాక్టర్ సూచన మేరకు ఎవరికైనా ఇచ్చే మందులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలి. కానీ బిల్లు కావాలంటే నిర్వాహకులు అదనంగా పది శాతం డబ్బులు వసూలు చేస్తున్నారు.
కానరాని తనిఖీలు
జిల్లావ్యాప్తంగా మందుల దుకాణాల నిర్వహణపై జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. కానీ ఆయన ఏనాడూ ఏ ఒక్క మందుల దుకాణంలో కూడా తనిఖీ చేసిన సందర్భాలు లేవు. హైదరాబాద్ నగరం నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించే ఆయన ఎప్పుడు వస్తారో? ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు. మందుల దుకాణాల ఇష్టారాజ్యంపై సంబంధిత జిల్లా అధికారుల చర్యలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మందుల దుకాణాలకు లెసైన్సులు ఉన్నా యా? సర్టిఫికెట్ ఉన్న ఫార్మాసిస్టే దుకాణం నిర్వహిస్తున్నారా? మందులు ఇచ్చే వారి కి అనుభవం ఉందా? లేదా? అనే విషయాలపై ఎన్నడూ తనిఖీలు నిర్వహిం చిన పాపాన పోలేదు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు మందుల దుకాణాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంై తెనా ఉందని పలువురు కోరుతున్నారు.