షాహిద్‌ని చంపేయాలి అనిపించింది!
అదొక అందమైన కల. ఆ కలలో తన ప్రియుడితో కలిసి ప్రేయసి యుగళ గీతం పాడుకుంటుంది. ఈ యుగళగీతం ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుందని రాజ్‌కుమార్ సంతోషి అంటున్నారు. షాహిద్ కపూర్, ఇలియానా జంటగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో’. పైన చెప్పిన యుగళ గీతం ‘తు మేరీ అగల్ బగల్ హై...’ అనే పల్లవితో సాగుతుంది.
ఈ పాటను ఏ స్విట్జర్లాండ్లోనో, యూరప్‌లోనో చిత్రీకరిస్తే బాగుంటుందని ఇలియానా భావించారు. కానీ, ప్రయాణాలతో విసుగు.. ఎంచక్కా ముంబయ్‌లోనే చిత్రీకరించేద్దాం అన్నారు షాహిద్. హీరో చెప్పిన తర్వాత తిరుగేముంటుంది? ముంబయ్‌లోనే షూటింగ్ చేసేశారు.
కానీ, ముంబయ్‌లో సూర్యుడు తన ప్రతాపం చూపించడంతో ఎండలో ప్రేమ పాట పాడుకోవడం చాలా ఇబ్బంది అనిపించిందని, షాహిద్‌ని చంపేయాలనిపించిందని ఇలియానా సరదాగా పేర్కొన్నారు. ఈ పాట సంగతి అలా ఉంచితే.. ఈ చిత్రంలో ఉన్న మరో పాట ‘మై రంగ్..’ గురించి చెప్పాలి. ఈ పాటను కూడా ముంబయ్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఇందులో ఏడు రకాల దుస్తుల్లో ఇలియానా కనిపిస్తారు.
పాట చిత్రీకరణ సమయంలో ప్రతి రెండు నిమిషాలకోసారి డ్రెస్ మార్చుకున్నానని, లోపల డ్రెస్ మార్చుకుంటుంటే, రెడీయా అని టెన్షన్ పెట్టేసేవాళ్లని ఇలియానా తెలిపారు. మొత్తం ఈ రెండు పాటల చిత్రీకరణను అంత సులువుగా మర్చిపోలేనని పేర్కొన్నారామె. ఈ చిత్రంలో షాహిద్, ఇలియానాల కెమిస్ట్రీ బాగుంటుందని దర్శకుడు అంటున్నారు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది.