బష్ ఎక్షా పోశా!
హ్యూమర్ ప్లస్
రాశి ఫలాల్లో వాహనయోగం అని వుంటే ఏంటో అనుకున్నా. టూ వీలర్ చెడిపోయి బస్సెక్కడం అనుకోలేదు. బైక్ సైలెన్సర్ సైలెంట్‌గా వుండక దగ్గడం మొదలుపెట్టింది. వంద సిగరెట్లు తాగిన దానిలా పొగ వదలసాగింది. నల్లటి దట్టమైన పొగకి, నా వెనుక వస్తున్నవాళ్ళు కకావికలైపోతున్నారు. జిపిఎస్ లాగా నేనెక్కడున్నానో ఆ పొగని చూసి గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది. పోకుండా, పొగపెట్టిన ఆ బండిని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాను. నాడి పట్టి పరిశీలించి పెదవి విరిచాడు. దింపుడు కళ్ళెం ఆశ వదిలేసి కర్మకాండ జరిపించమన్నాడు.తరువాత సిటీబస్సు ఎక్కడం ప్రారంభించాను.
దీంట్లో వున్న సుఖం ఏమంటే మనం నడపక్కరలేదు, మనల్ని ఎవరో నడుపుతారు. కాకపోతే రన్నింగ్‌లో ఎక్కి రన్నింగ్‌లో దిగడం తెలిసుండాలి. ఈ కన్ఫ్యూజన్లో ఎక్కడ ఎక్కుతున్నానో, దిగుతున్నానో తెలిసేది కాదు. చిల్లరదో సమస్య. టికెట్ వెనుక కండక్టర్లు రాస్తారు. చిన్నప్పుడు చూసిన షోలే సినిమాలో డైలాగులు గుర్తుంటాయి కానీ, చిల్లర గుర్తుండదు. చెల్లని చెక్కుల్లా జేబులో టికెట్లు మిగిలిపోతున్నాయి.డబ్బులు లేకపోయాయి కానీ, బస్సులో బోలెడంత కాలక్షేపం, కామెడీ. ఈమధ్య ఫిల్మ్‌నగర్ సిగ్నల్ దగ్గర ఒకడు వుండలా దొర్లుకుంటూ ఎక్కాడు, లేదా ఎగబ్రాకాడు. సీటులో సగమే కూచుని ‘బష్ ఎక్షా పోశా’ అన్నాడు. అదే రకం భాషో లేడీ కండక్టర్‌కి అర్థం కాలేదు. ‘టికెట్’ అంది తన భాషలో.
‘బష్ ఎక్షాపోశా కక్ర్’ అని వాడు మరాఠీ బెంగాలీ కలిపి వాగాడు. ఫుల్‌గా తాగినట్టున్నాడు. కిక్కెక్కినపుడు బస్సు ఎందుకు ఎక్కాడో అర్థం కాలేదు. ‘‘ఏమంటున్నాడన్నా వీడు’’ అడిగింది కండక్టర్. వాడి భాషపై నాక్కొంచెం భాషాభిమానం వుండడం వల్ల అనువాదం చేసి ‘‘బస్సు ఎక్కడికి పోతుంది కండక్టర్’’ అని అడుగుతున్నాడని చెప్పాను. ‘‘నువ్వెక్కడికి పోవాలా’’ అడిగింది కండక్టర్. మనవాడు సేమ్ డైలాగ్ పాములాంటి బుసతో రిపీట్ చేశాడు. లేడీ కండక్టర్ బాడీ బిల్డర్‌లా మారి విజిల్ కొట్టి బస్సు ఆపి వాడిని బయటికి విసిరేసింది. జిమ్నాస్టిక్స్ చేస్తూ ఒక కరెంటు పోల్ కింద సెటిలయ్యాడు.
∙∙
ఇంకోసారి ఒక సీనియర్ సిటిజన్ తగిలాడు. రూల్స్‌కి రోల్ మోడల్లా వున్నాడు. చిరిగిపోయి వంద రూపాయలిచ్చి టికెటివ్వమన్నాడు. నోట్ వేరేది ఇవ్వమన్నాడు కండక్టర్.‘‘నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయివి అవునా కాదా?’’ అని అడిగాడు సిటిజన్. అవునన్నాడు కండక్టర్ అయోమయంగా.‘‘మరి మీ గవర్నమెంట్ ప్రింట్ చేసిన నోట్‌ని, గవర్నమెంట్ ఎంప్లాయిగా నువ్వెందుకు తీసుకోవు?’’‘‘అన్నా, ఆ నోటు నేనియ్యలే కదా నీకు’’ అన్నాడు.‘‘ఇచ్చింది మీ గవర్నమెంటే కదా’’‘‘అరే, లొల్లి చేయకురా భయ్’’సిటిజన్ వినలేదు. దాంతో కండక్టర్‌కు ఏం చేయాలో తెలియక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, బస్సుని స్లోగా నడుపుతున్న డ్రయివర్ వరకూ అందర్నీ తిట్టాడు. ఎందుకు తిట్టాడో అతనికి కూడా తెలియదు. ‘‘మీ గవర్నమెంట్ మీద మీకే గౌరవం లేకపోతే మాకెందుకుండాలి?’’ అని సిటిజన్ దిగిపోయాడు. ‘‘ఎక్కణ్నుంచి వస్తార్రా ఈ ఎర్రగడ్డ బ్యాచంతా’’ అని కండక్టర్ గొణుక్కుంటూ రైట్ చెప్పాడు.
బస్సులు లేనపుడు సర్వీస్ ఆటోల్లో ఎక్కడానికి ప్రయత్నించాను కానీ అదంత సులభం కాదు. డ్రైవర్ మీద ప్రయాణీకులు కూచుంటారో, ప్రయాణీకుల మీదే డ్రైవర్ కూచుంటాడో అర్థం కాదు. ఒక్కోసారి డ్రైవర్ నిలబడి కూడా డ్రైవ్ చేస్తాడు. గోతులు, స్పీడ్ బ్రేకర్లు దేన్నీ లెక్కచేయడు. మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. తిరుపతిలో జెవిఆర్కె రెడ్డి అని మంచి మిత్రుడున్నాడు. మనిషి ఎంత మృదువో, డ్రైవింగ్‌లో అంత కఠినం. స్పీడ్‌బ్రేకర్ల దగ్గర బ్రేక్ వేయకూడదని ఆయన సిద్ధాంతం. ఆయన బండిలో కూచుంటే ఇంటికే పోతామో, డాక్టర్ దగ్గరికి పోతామో చెప్పలేం. వాహనాల గురించి ఎప్పుడు రాసినా, ఆయన్ని స్మరించకుండా వుండలేను.
– జి.ఆర్. మహర్షి