ఆంధ్రారోమ్‌లో క్రిస్మస్ జెండా పండుగ
* క్రీస్తు జయంతి వేడుకలకు చిహ్నంగా జెండా ఆవిష్కరణ
* హాజరైన విజయవాడ బిషప్ రాజారావు
ఫిరంగిపురం: క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని విజయవాడ వేత్రాసన పీఠాధిపతి (బిషప్) తెలగతోటి జోసఫ్ రాజారావు చెప్పారు. ఆంధ్రారోమ్‌గా ప్రసిద్ధి చెందుతున్న ఫిరంగిపురంలోని బాలయేసు దేవాలయంలో క్రీస్తు జయంతి వేడుకల చిహ్నంగా ఆదివారం జెండా ప్రతిష్ట మహోత్సం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బిషఫ్ రాజారావు మాట్లాడుతూ ప్రేమ ,కరుణ, దయ గుణాలతో తోటి వారిని ఆదుకుంటూ క్రీస్తు బోధనలను పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. జెండాను ఆశీర్వదించి దివ్యపూజాబలి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోషే ప్రవక్త, పునీత అంతోని, పునీత ఇన్యాసి, పునీత చిన్నతేరేజమ్మ విగ్రహాలను బిషఫ్‌తోపాటు ఫాదర్ యువారి అంతోని, ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆశీర్వదించారు. కార్యక్రమంలో సహాయ విచారణ గురువులు ఫాదర్ బత్తినేని విద్యాసాగర్, మల్లవరపు బాలశౌరి, స్థానిక క్రైస్తవులు, మత పెద్దలు, కన్యాస్త్రీలు, తదితరులు పాల్గొన్నారు.
15 నుంచి నవదిన ప్రార్థనలు...
క్రీస్తు జయంతి మహోత్సవ నవదిన ప్రార్థనలు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతాయని ఫాదర్ బెల్లంకొండ జయరాజు చెప్పారు. 15న తెనాలి రెక్టర్ ఫాదర్ అల్లం చిన్నపరెడ్డి, 16న ఫాదర్ గాదె రాజశేఖర్, 17న ఫాదర్ మంటి మరియదాసు, 18న ఫాదర్ నెట్టెం రాజేష్‌కుమార్, 19న ఫాదర్ సంగాబత్తుని సుధాకర్, 20న ఫాదర్ మేకల ఆనంద్, 21న ఫాదర్ కొమ్మతోటి అమృతరాజు, 22న ఫాదర్ పత్తి చిన్నారావు, 23న ఫాదర్ కుప్పాల ప్రకాష్ పూజలు నిర్వహిస్తారన్నారు.