నెత్తురోడిన రహదారి
గుల్బర్గా జిల్లాలో బోలెరెను ఢీకొన్న ఫ్లైయాష్ ట్యాంకర్
ఏడుగురి దుర్మరణం
నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన
నిశ్చితార్థం జరిగిన యువకుడు కూడా దుర్మరణం
యాదగిరి : మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన యువకుడు సహా ఏడుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాద ఘటన గుల్బర్గా జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. యాదగిరి పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన దుర్గయ్య తాండూకర్‌కు గుల్బర్గాలో ఓ యువతితో పెళ్లి సంబంధం ఖాయమైంది. ఈక్రమంలో మంగళవారం ఉదయం నిశ్చితార్థకార్యక్రమానికి దుర్గయ్య, మరో ఆరుగురు బోలెరో వాహనంలో గుల్బర్గాకు వెళ్లారు.
కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా, రాత్రి 7 గంటల సమయంలో గుల్బర్గా జిల్లా చిత్తాపుర తాలూకా కుంబారహళ్లి గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన ఫ్లైయాష్ ట్యాంకర్ ఢీకొంది. ప్రమాదంలో బోలెరో డ్రైవర్ శివు హులినాయక్ (24)తో పాటు అందులో ప్రయాణిస్తున్న కాశీనాథ్ తళకు (34), యల్లయ్య పూజారి(25), దుర్గయ్య తాండూర్‌కర్ (25), ప్రమోద్ సుండల్‌కర్ (22), నాగరాజ్ హణవార్ (24), రాజు నక్కల్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. గుల్బర్గా ఎస్పీ అమిత్ సింగ్, వాడీ డీఎస్పీ మహేష్ మేఘణ్ణవర్, సీఐ శంకర్‌గౌడ పాటిల్‌కు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను యాదగిరి ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మృతుల కుటుంబాలను పరామర్శించలేదని ఆందోళన
మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి బాబురావ్ చించనసూర్ రాకపోవడాన్ని ఖండిస్తూ బుధవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ఆ సమాజ ప్రజలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. మంత్రి నగరంలో ఉండి కూడా బాధితుల కుటుంబాలను పరామర్శించకపోవడం దళితులను అవమానపరచడమేనన్నారు.
తక్షణమే మంత్రి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. నగరసభ సభ్యుడు స్యామసన్ మాళికెరి మాట్లాడుతూ నగరంలో మంత్రి ఉండి కూడా మృతుల కుటుంబాలకు కనీసం సంతాపం కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తక్షణం బాబురావ్ చించనసూర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివయోగి భండారి, మలినాథ సుంగలకర్, మారెప్ప, ప్రభు, సాబణ్ణ, శరణు, సంతోష్ పాల్గొన్నారు.