కొత్త కోడలిలా వ్యవహరించాలి..
సర్కార్కు ‘సామ్నా’ సూచన
సాక్షి, ముంబై: కొత్త కోడలు అత్తవారింట అణకువతో అందరినీ సంతోషపరిచేందుకు మనస్ఫూర్తిగా పనిచేసేటట్లుగానే బీజేపీ సర్కార్ కూడా రాష్ట్ర ప్రజల ఆశలను తీర్చాలని ‘సామ్నా’లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. సామ్నా శనివారం సంపాదకీయంలో ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజునే బీజేపీ ప్రభుత్వానికి సున్నితంగా మందలింపుతోపాటు సలహాలు, సూచనలు అందిస్తూ తనదైన శైలిలో హెచ్చరికలు జారీచేశారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వాన్ని నవ వధువుతో, రాష్ట్ర ప్రజలను అత్తతో పోల్చారు.
పెళ్లైన కొత్తలో అత్తతోపాటు కుటుంబాన్ని సంతోషంగా ఉంచేందుకు కొత్త కోడలు పనులన్నింటినీ మనస్ఫూర్తిగా చేస్తుందని, తర్వాత అత్తపై పెద్దరికం చెలాయించేందుకు ప్రయత్నిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే మహారాష్ట్ర ప్రజలు కఠినమైనవారు కాకపోయినా మంచి అత్తలాంటివారని బీజేపీకి చురకలంటించారు. అదేవిధంగా అత్తను (మహారాష్ట్ర ప్రజలను) సంతోషపెట్టడం కోడలి కర్తవ్యమని బీజేపీకి సూచించారు. అలాచేయకుండా అత్తపై పెద్దరికం చెలాయించేందుకు ప్రయత్నిస్తే మాత్రం తాము చెవులు పిండుతామని పేర్కొన్నారు.
హామీలను పూర్తిచేయాలి...
మహారాష్ట్రను ముక్కలుచేయకుండా అఖండంగానే ఉంచాలని ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని కోరారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు కొత్త ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతోపాటు ఎన్నో ఆశలు ఉంటాయని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వారిదేనని ఆయన స్పష్టం చేశారు. డీఎఫ్ సర్కారు గత 15 ఏళ్లల్లో ప్రజల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోయిందని, ఇలాంటి సందర్భంలో కొత్త ప్రభుత్వం ‘ఫినిక్స్ పక్షి’ మాదిరిగా పైకి ఎగరాలని, ఇది కొత్త ముఖ్యమంత్రితో జరగాలని తాము కోరుకుంటున్నట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు.