సెల్‌ఫోన్‌ను రిమోట్‌గా నియంత్రించే యాప్
కంప్యూటర్ మీద పనిచేసుకుంటూ ఉంటాం. అదే సమయంలో ఫోన్ నుంచి ఏదైనా మెసేజ్ పంపాలి, లేదా ఫోన్ ఆన్సర్ చేయాలి. అప్పుడు చెవికి, భుజానికి మధ్యలో ఫోన్ ఆనించుకుని మెడ నొప్పి పుట్టేలా మాట్లాడటం చాలామందికి అలవాటు. ఇప్పుడా అవసరం లేకుండా, రిమోట్‌గానే సెల్‌ఫోన్‌ను నియంత్రించేందుకు ఓ కొత్త యాప్ వచ్చేసింది. కేరళకు చెందిన లివారెస్ టెక్నాలజీస్ అనే సంస్థ 'ఫోన్ ఎవే' అనే ఈ కొత్త యాప్‌ను రూపొందించింది. దీని సాయంతో ఫోన్‌ను మరో మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి నియంత్రించవచ్చు. ఈ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని లివారెస్ టెక్నాలజీస్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ జసీల్ అబ్దుల్ రఫీక్ తెలిపారు.
ఈ యుటిలిటీ యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై అందుబాటులో ఉంది. ఫోన్ మన చేతిలో లేకపోయినా అది ఉన్నట్లే చేసేందుకు ఫోన్ ఎవే యాప్ ఉపయోగపడుతుందని రఫీక్ చెప్పారు. యూజర్ తనవద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, మరో ఫోన్ నెంబరును రిజిస్టర్ చేయాలి. దానిద్వారా ఈ ఫోన్లో ఉండే వివరాలను పొందచ్చు. దాంతోపాటు, ఎస్ఎంఎస్, ఈ మెయిల్ లేదా రెండింటి ద్వారా కూడా కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. ఇకసారి ఈ యాప్ ఇన్స్టాల్ అయితే, అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది.
ఎస్ఎంఎస్ కమాండ్ ఇవ్వడం ద్వారా ఆ స్మార్ట్ ఫోన్‌ను యూజర్లు నియంత్రించుకోవచ్చు. అప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టివేట్ అయ్యి, యాప్ ఆటోమేటిగ్గా రన్ అవుతుంది. యాప్ ద్వారా నిర్దేశించే రకరకాల ఆపరేషన్లను యూజర్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని కాల్ లాగ్‌ను రిమోట్‌గా తమ ఈమెయిల్ ద్వారా లేదా మరో ఫోన్లోకి టెక్స్ట్ మెసేజ్ రూపంలో చూసుకోవచ్చు. అలాగే ఆ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్లనూ చూసుకోవచ్చు. అలాగే, ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టి, ఎక్కడో ఉంచి మర్చిపోయినా సరే, 'రిమోట్ రింగర్' సదుపాయంతో అదెక్కడుందో కనుక్కోవచ్చు. అంటే, ఫోన్ సైలెంట్లో ఉన్నా కూడా రింగవుతుందన్న మాట. అంతేకాదు, ఒకవేళ ఫోన్ పోయినా కూడా, జీపీఎస్ ద్వారా అదెక్కడుందో కచ్చితంగా కనిపెట్టి, ఆ లొకేషన్‌ను రెండో ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతుంది. దాంతో ఫోన్ దొంగలను ఇట్టే పట్టేయవచ్చన్న మాట!!