ఫోన్ లో బెదిరిస్తున్నారు: ముతాలిక్
హుబ్లీ: చంపుతామంటూ ఫోన్ లో తనకు బెదిరింపులు వస్తున్నాయని శ్రీరామ సేన నాయకుడు ప్రమోద్ ముతాలిక్ తెలిపారు. ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల గురించి, ఇస్లాం గురించి మాట్లాడవద్దంటూ తనను ఫోన్ లో బెదిరించారని వెల్లడించారు. గతంలోనూ తనకు బెదింపులు వచ్చాయని చెప్పారు. అయితే ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. హిందూమత పరిరక్షణ కోసం పనిచేయకుండా తనను ఎవరూ ఆపలేరని అన్నారు.
2009లో మంగళూరులోని ఓ పబ్లో మహిళలపై శ్రీరామ్సేన దాడి చేయడంతో ముతాలిక్ వార్తల్లోకెక్కారు. అప్పటినుంచి సంచలన ప్రకటనలతో వివాదస్పదుడిగా మారారు. 'అత్యాచారానికి పాల్పడిన వారి చేతులు నరికేయండి. వారి కోర్టు ఖర్చులు మేమే భరిస్తాం' అంటూ గతంలో ఆయన పిలుపునిచ్చారు. గోవా ప్రభుత్వం గతేడాది శ్రీరామసేనపై నిషేధం విధించింది.
కాగా, దేశంలో మత అసహనం పెరిగిపోతోందని వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ పై హిందుత్వ వాదులు మండిపడుతున్నారు. శివసేన నేతలయితే ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు.