నేడు ‘తాండవ’ మహాజనసభ
పాయకరావుపేట : తాండవ చక్కెర కర్మాగారం 2014-15 క్రషింగ్ సీజన్ నవంబర్ మూడో వారంలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఫ్యాక్టరీ మహాజన సభ జరగనుంది. ఈ కర్మాగారం 2013-14 సీజన్లో 1,78,361 టన్నులు చెరకు క్రషింగ్ చేసి 1,74,985 బస్తాల పంచదార దిగుబడి సాధించింది. 9.9 రికవరీతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో 2 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
చెరకు సాగు ప్రోత్సహించేందుకు 5,870 మందిై రెతులకు రూ.1.73 కోట్ల విలువ చేసే చెరకు విత్తనం, రూ.1.70 కోట్ల యూరియా, 2,500 టన్నుల సూఫర్ ఫాస్పేట్, పొటాష్లను వడ్డీ లేని అప్పు కింద సరఫరా చేశారు. 2,415 ఎకరాల్లో ఉడుపు,7478 ఎకరాల్లో కార్శితోటల్లో 2.4 లక్షల టన్నుల చెరకు సరఫరా చేసేందుకు రైతులతో ఫ్యాక్టరీ అధికారులు అగ్రిమెంట్లు తీసుకుంటున్నారు. మూడు నెలల క్రితం చేపట్టిన ఓవర్ హాలింగ్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. గత సీజనులో క్రషింగ్‌కు అంతరాయం ఏర్పడిన మిల్లులో లోపాలు సరిచేశారు.
ప్రస్తుతం ఫ్యాక్టరీలో 90 వేల బస్తాల పంచదార నిల్వలు ఉన్నాయి. చెరకుకు ధర లభించక తాండవ సుగర్స్ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పెరిగిన పెట్టుబడులకనుగుణంగా గిట్టుబాటు ధర లేకపోతే భవిష్యత్తులో చెరకు సాగు సాధ్యం కాదని అంటున్నారు. గత ఏడాది ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.1870లు ఇవ్వగా ప్రభుత్వం రూ.160లు ప్రోత్సాహం ప్రకటించింది. దీంతో టన్నుకు రూ.2030 గిట్టుబాటు కల్పించారు. రైతులకు రూ.7.90 కోట్లు చెల్లింపులు చేశారు. జిల్లాలో ఏటికొప్పాక, చోడవరం ఫ్యాక్టరీల్లో టన్నుకు రూ.2200 నుంచి 2400 వరకూ మధ్దతు ధర చెల్లిస్తున్నారు. ‘తాండవ’ యాజమాన్యం కూడా అదే ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
రెండేళ్ల తరువాత మహాజన సభ..
ఏటా క్రషింగ్ ప్రారంభానికి రెండు నెలల ముందు మహాజనసభ నిర్వహించడం ఆనవాయితీ. ఫ్యాక్టరీకి పాలకవర్గం లేక రెండేళ్లుగా రైతు మహాజన సభ నిర్వహించలేదు. కొత్త పాలకవర్గం పగ్గాలు చేపట్టడంతో ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు రైతు మహాజన సభ జరగనుంది. ఇందులో టన్నుకు ఎంత ధర ప్రకటిస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు.