భళా... కనికట్టు కళ!
సృజనకు, రకరకాల భావోద్వేగాలకు చాలా దగ్గరి బంధం ఉంది. సంతోషమే కాదు బాధలో నుంచి కూడా సృజన పుడుతుంది. మెరుగుపడుతుంది. గ్రీకుదేవత గైయ గురించి తెలిసినవారికి, తెలియని వారికి తన ఫొటోసిరీస్ ద్వారా సరికొత్తగా పరిచయం చేస్తుంది క్రిస్టీ....
శోకం నుంచి శ్లోకం పుట్టింది ఆనాడు. ఇప్పుడు సౌందర్యసారాన్ని పరిచయం చేసే ‘కళాత్మకం’ పుట్టింది. ముప్పై ఆరు సంవత్సరాల క్రిస్టీ మిచెల్ (యుకె)కు తన తల్లి మరణాన్ని తట్టుకోవడం కష్టంగా మారింది. రెండు కళ్లనిండా దుఃఖపు రాసులు తప్ప ఏమీ లేవు. హృదయం విషాదం, వైరాగ్యంతో మొద్దుబారిపోయింది.
‘ఇలా అయితే కష్టం’ అని హెచ్చరించింది ఆమెలోని రెండోమనిషి. ఇక అప్పుడు తనను తాను మార్చుకునే దిశగా అడుగులు వేసింది క్రిస్టీ. ఆమె తల్లి మారిన్ ఇంగ్లిష్ టీచర్. పిల్లల ఊహకు పదునుపెట్టే ఎన్నో కథలను ఆమె ఆసక్తికరంగా చెప్పేది. అందులో గ్రీకు పురాణానికి సంబంధించిన కథలు కూడా ఉండేవి. తన దుఃఖాన్ని సృజనాత్మక ప్రయాణంలో మార్చడానికి ఆ కథలను వాహికగా ఎంచుకుంది క్రిస్టీ.
చిన్నపాటి సమ్మర్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఫొటోగ్రఫిక్ సిరీస్ ఇన్స్పిరేషనల్ క్రియేటివ్ జర్నీగా మారింది. పదాలు, వాక్యాలు ఏమీ లేకుండా ‘అన్ఎక్స్ప్లెయిన్డ్ స్టోరీబుక్’కు శ్రీకారం చుట్టింది. గ్రీకు దేవత గైయ మీద క్రిస్టీ ఫొటో సిరీస్ చేసింది. భూమి, దేవతలు, సమస్త విశ్వానికి గైయ దేవత జన్మనిచ్చిందని గ్రీకు పురాణం చెబుతుంది.
గైయ దేవత రూపం...అపురూపం!
మేకప్ ఆర్టిస్ట్ ఎల్బి ఇడెన్ సహాయంతో మోడల్ మారియా టోకాను గైయ దేవతగా తీర్చిదిద్దింది క్రిస్టీ. దుస్తులను కూడా తానే స్వయంగా డిజైన్ చేసింది. ఆమెకు ఫ్యాషన్ అండ్ కాస్ట్యూమ్స్ డిజైన్‌లో మంచి అనుభవం ఉంది. సినిమాల మాదిరిగా సెట్లు వేయించింది.
క్రిస్టీ తన సొంత ఖర్చుతో చేసిన ‘అన్ఎక్స్ప్లెయిన్డ్ స్టోరీ బుక్’ ప్రాజెక్ట్‌కు నాలుగున్నర సంవత్సరాల కాలం పట్టింది. పదాలతో పని లేకుండా అసాధారణ రీతితో పుస్తకాన్ని తీసుకురావాలనే ఆమె సంకల్పం ఎట్టకేలకు నెరవేరింది. ఆమె పనితనానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.
‘‘దుఃఖం నుంచి దారి మళ్లాలనే ప్రయత్నం నన్ను సృజనాత్మకమైన దారుల్లోకి ప్రయాణం చేసేలా చేసింది’’ అంటున్న క్రిస్టీ తన లేటెస్ట్ ఎడిషన్‌ను శక్తిమంతమైన భావోద్వేగ వేదికగా తీర్చిదిద్దింది.