రాబోయే నాలుగేళ్లలో ఇంజనీరింగ్‌కు అధిక ప్రాధాన్యత
బళ్లారి (తోరణగల్లు) : రాబోయే నాలుగేళ్లలో ఇంజనీరింగ్‌కు అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని బెంగుళూరుకి చెందిన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీస్) సెంటర్ హెడ్ ఈఎస్. చక్రవర్తి తెలిపారు. ఆదివారం నగరంలోని రావు బహదూర్ వై. మహాబళేశ్వరప్ప ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంజనీరింగ్ విద్యకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రపంచంలోనే మనదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ప్రాముఖ్యత పొందిందన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థులు సమాచారాన్ని క్షుణ్ణంగా చదవడం, చదివిన దాన్ని అర్ధం చేసుకోవడం, అర్ధం చేసుకున్న విషయాలను విజ్ఞానంగా మలచుకోవాలన్నారు. విద్యార్థులు చివరి ఏడాది సమర్పించే ప్రాజెక్ట్ సదస్సులకు హాజరు కావడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఇంజనీరింగ్ విద్యతోపాటు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను నేర్చుకోవాలన్నారు. దీంతోపాటు కమ్యూనికేషన్ ప్రతిభను పెంచుకోవాలన్నారు.
ప్రముఖ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు మన సంస్కృతి, మానవ విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. విశ్వవ్యాప్తంగా వృత్తిలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ముఖ్యంగా అంగ్ల భాషపై పట్టు సాధించాలన్నారు. ప్రస్తుతం రైతులు, ఆఖరికి మత్య్సకారులు సైతం మొబైల్ ఫోన్లో వాతావరణ వివరాలను తెలుసుకుంటున్నారన్నారు. మరో అతిధి పశ్చిమబెంగాల్ డీజీపీ జీఎంపీ రెడ్డి ఇంజనీరింగ్ విద్య ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో హోస్పేటకు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ టీ.అజయ్ కుమార్, మైనింగ్ యజమానులు అల్లం దొడ్డప్ప, వై.సతీష్, వీవీ సంఘం అధ్యక్షుడు అల్లం గురుబసవరాజు, ఉపాధ్యక్షుడు కెఎం.మహేశ్వరస్వామి, కార్యదర్శి హెచ్ఎం.గురుసిద్దస్వామి, సహకార్యదర్శి జెఎస్.నేపాక్షప్ప, కోశాధికారి సంగనకల్లు హిమంత్రాజ్, ప్రిన్స్‌పాల్ డాక్టర్ కె.వీరేష్, మాజీ ఎమ్మెల్యే బీ.శివరామిరెడ్డి, సభ్యులు డాక్టర్ అరవింద్ పాటిల్, మల్లనగౌడ తదితరులు పాల్గొన్నారు.