పీఈటీలు, విద్యార్థులకు యోగా శిక్షణ
ఏలూరు సిటీ : పాఠశాలల్లో పిల్లలకు యోగా శిక్షణ ఇచ్చేందుకు నిర్దేశించిన కార్యక్రమంలో భాగంగా వ్యాయామోపాధ్యాయులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఏలూరు ఉప విద్యాధికారి డి.ఉదయకుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక అశోక్‌నగర్‌లోని కేపీడీటీ ఉన్నత పాఠశాల ఆడిటోరియం ఏలూరు డివిజన్లోని ద్వారకాతిరుమల, భీమడోలు మండలాలకు చెందిన ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామోపాధ్యాయులకు యోగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. సుమారు 103 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణలకు హాజరయ్యారని, నాలుగో దశ యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలల్లోని పీఈటీలకు శిక్షణ తరగతులు చెప్పించి అనంతరం పాఠశాలల్లో పిల్లలకు యోగా శిక్షణ ఇస్తామన్నారు. యోగా శిక్షకులు జయమోహన్ ఆధ్వర్యంలో పీఈటీలకు శిక్షణ ఇస్తున్నారన్నారు. విద్యార్థులకు ఈ యోగా శిక్షణల ద్వారా చదువుపై ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడతాయన్నారు.