మానవత్వం మరిచి.. ప్రేమతత్వం విడిచి
రామంతపురం: పిలుపులు వినిపిస్తాయేమోగానీ ఎదురు సమాధానం చెప్పలేడు. పోని ఎక్కడికైనా చకచకా కదులుదామంటే శరీరం సహకరించదు. చుట్టూ భయంభయంగా చూపులు. ఎవరైనా దగ్గరికొచ్చి పలుకరిస్తే మోముపై నవ్వులు. ఇది తమిళనాడులో తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఓ శారీరక మానసిక వికలాంగ బాలుడి హృదయవిధారక ఘటన. ఆ బాలుడిని కన్నవారే నడి రోడ్డున వదిలేశారు.
పైగా అతడు మూగవాడు కూడా. రామంతపురంలోని ఎర్వాది దర్గా వద్దకు తీసుకొచ్చిన అతడి తల్లిదండ్రులు కాసేపట్లో వస్తామని చెప్పి వెళ్లిపోయారని దర్గా అధికారులు తెలిపారు. తర్వాత దర్గా అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి అతడి బ్యాగు తనిఖీ చేయగా మూడు జతల బట్టలు మాత్రం కనిపించాయి. వివరాలు రాబట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా మూగవాడు కావడంతో కేవలం నవ్వడం, భయంగా చూడటం తప్ప ఏమి చేయలేకపోయాడు. దీంతో జిల్లాలోని చైల్ప్ లైన్ కు తరలించారు.