ఐఈఆర్టీలు స్థానికంగా ఉండాలి
దండేపల్లి : జిల్లాలోని భవిత కేంద్రాల్లో పని చేస్తున్న ఐఈఆర్టీలు స్థానికంగా ఉండాలని ఐఈఆర్టీ జిల్లా కో–ఆర్డినేటర్ లస్మన్న సూచించారు. దండేపల్లి మోడల్ భవిత కేంద్రాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవిత కేంద్రంలోని రికార్డులు, రిజిష్టర్లు పరిశీలించారు. హోమ్బేస్డ్(ఇంటివద్ద విద్య) ఫలితాల తీరును ఐఈఆర్టీ రాజమల్లును అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన హాజరు రిజిష్టర్లను తనిఖీ చేశారు. మండలంలో కొత్తగా గుర్తించిన ప్రత్యేక అవసరతలు గల పిల్లల వివరాలు, అలింకో క్యాపుల నిర్వహణపై తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో మరిన్ని భవిత కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో కొత్తగా ఈ సంవత్సరం నాలుగు భవిత కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్పోర్టు అలవెన్స్ రాని వికలాంగ పిల్లలకు త్వరలో అందజేస్తామని తెలిపారు. భవిత కేంద్రాల్లోని ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేస్తామని అన్నారు.