దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఆపై ఆత్మహత్య
ఎన్పీకుంట: దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆపై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలం సారగుండ్లపల్లిలో జరిగింది. కదిరి డీఎస్పీ శ్రీలత, రూరల్ సీఐ నాగేంద్ర కథనం ప్రకారం... సారగుండ్లపల్లికి చెందిన పి.జనార్దన (36) తన భార్యను పుట్టినిల్లు అయిన తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో వదిలి ఆదివారం రాత్రి స్వగ్రామానికి బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలోని కొత్తమిద్ది గ్రామంలో వినాయక మండపం వద్ద రాత్రి 8 గంటల సమయంలో ఆడుకుంటున్న దివ్యాంగురాలైన 17 ఏళ్ల బాలికను కంపచెట్లలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న చిన్న పిల్లలు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జనార్దనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..జనార్దన తన స్వగ్రామంలో నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోని వంట గదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని సోమవారం ఉదయం తల్లి గమనించింది. కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్పీకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు మృతుడిని పరిశీలించగా చేతికి, వేలుకు ఇంకు అంటి ఉండటాన్ని గమనించి ఘటన స్థలంలో వెతకగా సూసైడ్‌నోట్ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.