ఆటోలో ఎత్తుకుని పోయి గ్యాంగ్‌రేప్
గుంటూరు : ఫ్యాక్టరీ నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువతిని ఐదుగురు యువకులు అపహరించుకుని పోయి... సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని సుందరయ్యకాలనీకి చెందిన యువతి (25) స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ఎప్పటిలాగే ఆమె సోమవారం రాత్రి ఏడు గంటలకు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె స్నేహితుడైన రహీం, మరో నలుగురు కలసి ఆమెను ఆటోలో ఎత్తుకుపోయారు.
సమీపంలోని దేవరంపాడు అటవీ ప్రాంతంలో ఆమెపై వరుసగా లైంగికదాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని... తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో వారు పిడుగురాళ్ల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరులోని జీజీహెచ్‌కి తరలించారు.