కలగా గోదాం నిర్మాణం
- రంగంపేట పీఏసీఎస్ ప్రతిపాదనలు బుట్టదాఖలు
కొల్చారం : జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రంగంపేట సంఘానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏడు గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రంగంపేట పీఏసీఎస్ 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ సంఘం పరిధిలో రంగంపేట, సంగాయిపేట, తుక్కాపూర్, పైతర, కోనాపూర్, ఏటిగడ్డ మాందాపూర్, ఎనగండ్ల గ్రామాలు కొనసాగుతు ఉన్నాయి. రైతులు తాము పండించిన పంటలను అమ్మేందుకు రంగంపేట పీఏసీఎస్‌కు తీసుకువస్తారు. ఈ పరిస్థితుల్లో కొనుగోలు కోసం తెచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వర్షాకాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో పాటు ఉండటానికి కూడా నిలువ నీడలేని పరిస్థితి నెలకొంది. నాలుగున్నర ఎకరాల స్థలం ఉన్నప్పటికీ ప్రస్తుతం చిన్న గదుల్లోనే సహకార సంఘాన్ని కొనసాగిస్తున్నారు. గోదాం నిర్మాణం కోసం గత ఐదేళ్ల నుంచి ఇక్కడి సహకార సంఘం పాలకవర్గం చేస్తున్న ప్రతిపాదనలు, విన్నపాలను పట్టించుకునే వారే కరువయ్యారు.
ఏడాదిన్నర క్రితం గోదాం నిర్మించేందుకు జిల్లా డీసీసీ అధికారులు , స్థానిక పాలకవర్గం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లింది. గోదాం నిర్మాణానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. ఇప్పటికైనా జిల్లా సహకార సంఘం అధికారులు, పాలకవర్గం స్పందించి గోదాము నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.