‘పిల్లా నువ్వులేని జీవితం’ నచ్చిందా..!
* అభిమానులను పలుకరించిన హీరోహీరోయిన్లు
* సినిమాను థియేటర్లో చూడండి..
కరీంనగర్‌కల్చరల్ : పిల్లా నువ్వులేని జీవితం సినిమాను పైరసీ సీడీల్లో కాకుండా థియేటర్లోనే చూసి ఆశీర్వదించాలని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, నిర్మాత దిల్ రాజు అన్నారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా గురువారం ఆ చిత్రం ప్రదర్శిస్తున్న నగరంలోని వేంకటేశ్వర థియేటర్, ప్రతిమా మల్టీప్లెక్స్‌లో హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రెజీనా, దర్శకుడు ఏఎస్.రవికుమార్చౌదరితో కలిసి ప్రేక్షకులను కలుసుకున్నారు. వారికి అభిమానులు డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు.
ప్రతిమా మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ సీడీలు బయటకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతకు పెట్టిన డబ్బు రాక, మళ్లీ సినిమా తీసే ఆలోచన మానుకుంటున్నారన్నారు. సినిమాను థియేటర్లలో చూడడంతోనే ఆనందం ఉంటుందన్నారు.
చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రెజినా మాట్లాడుతూ చిత్ర విజయానికి కారణమైనవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నిర్మాతలు బన్నివాసు, శ్రీహర్షిత్, నటుడు ప్రభాస్‌శ్రీను, మల్టీప్లెక్స్ జనరల్ మేనేజర్ రఘువేంద్రబాబు, ఎజీఏం వేణు, మేనేజర్ జగదీశ్వర్, శ్రీకాంత్, మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు.