నకిలీ ఖలీఫా మిథ్యా సామ్రాజ్యం
ఖలీఫాగా ప్రకటించుకున్న ఐఎస్ఐఎస్ నేత బాగ్దాదీ తమను వ్యతిరేకించే సున్నీ మత పెద్దలను సైతం హతమారుస్తున్నారు. నైనివే రాష్ట్రంలో ఈ సున్నీ ఉగ్రమూకలను సున్నీలే తరిమికొడుతున్నారు. ఇరాక్ సంక్షోభం షియా, సున్నీ ఘర్షణ అనేది భ్రమని తేలుతోంది.
నేడు ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రముఖ వ్యక్తి ఎవరు? నిస్సంశయంగా డాక్టర్ ఇబ్రహీం అల్ బద్రి. పేరును మార్చి, మారు వేషం దాల్చి ఇరాక్ అగ్నిగుండం మంటల్లో వెలిగిపో తున్న అబూ బకర్ అల్ బాగ్దాదీ. ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ సామ్రాజ్యపు ‘ఖలీఫా’గా అవతరించడానికి ముందు ఆయన నామధేయం అదే. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ అధినేతగా వెలుగులోకి వచ్చి ప్రపంచానికి అధినాయకునిగా మారిపోయిన ఇబ్రహీం... మహ్మద్ ప్రవక్త మామ, మధ్య యుగాల నాటి ప్రముఖ ఖలీఫా అబూ బకర్ అల్ బాగ్దాదీ వేషం కట్టారు. కానీ నిజంగా ఖలీఫాల కాలమైతే అతన్ని ఇస్లాం నుంచి వెలివేసేవారే. ఖలీఫా అబూ బకర్ నుండి చిట్ట చివరి ఖలీఫా అబ్దుల్ మెసిద్ (1868-1944) వరకు అంతా గొప్ప వివేచనాపరులు, పండితులు. ప్రపంచ వైజ్ఞానిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఇస్లాం నాగరికత అందిం చిన గొప్ప వారసత్వ సంపదకు కారకులు. వారందరికీ భిన్నంగా నేటి నకిలీ ఖలీఫా ‘ప్రతి ఒక్కరినీ చంపండి’ అనే సందేశాన్ని, మసీదులను, ఇస్లామిక్ సాంస్కృతిక వారసత్వ సంపదను కూల్చే కర్తవ్యాన్ని ప్రబోధిస్తున్నాడు.
ఇరాక్ సంక్షోభమంతా షియా, సున్నీల గొడవగా అంత ర్జాతీయ మీడియా పలికింది. కానీ ఈ కొత్త దేవుడికి అలాం టి వివక్ష లేదు. ఎవరినైనా చంపడమే. ఈ నెల 6న ‘ఖలీఫా ఇబ్రహీం’ ప్రపంచానికి తొలిసారిగా దర్శనమిచ్చిన మొసుల్ లోని సుప్రసిద్ధ నురిద్దిన్ మసీదు ఇమాం మొహ్మద్ అల్ మన్సూరీ సహా మొసుల్‌కు చెందిన 13 మంది సున్నీ మత పెద్దలను జూన్ 12, 14 తేదీల్లో హతమార్చారని ఐరాస మానవహక్కుల సంస్థ తెలిపింది. ఉగ్రవాదానికి కుల, మత, జాతి విభేదాలు ఉండవు. మొసుల్లోని సున్నీ మతపెద్దలను హతమార్చి అదే నురిద్దిన్ మసీదు నుండి కొత్త దేవుడు ప్రపంచానికి దర్శనమిచ్చాడు. పశ్చిమం నుంచి తూర్పు వరకు ముస్లింల ప్రపంచ విజయ యాత్రే తన లక్ష్యమని ప్రకటించాడు.
ఇరాక్‌లోని నూర్ అల్ మలికి ప్రభుత్వాన్ని ఆదుకో డానికి అమెరికా పంపానన్న దాదాపు మూడు వందల మంది సైనిక నిపుణులు అమెరికా రాయబార కార్యాలయం దాటి కాలు బయటపెట్టిన పాపాన పోలేదు. మానవ రహిత ద్రోన్ విమానాల దాడులకు ముహూర్తం కోసం అది వేచి చూస్తేనే ఉంది. ఏ ముహూర్తాల గొడవ లేకుండా ఇరాన్ తన ప్రత్యేక సైనిక దళాలను రంగంలోకి దించి కొత్త దేవుడి సేనలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ‘ఖలీఫా ఇబ్రహీం’ పుట్టి పెరి గిన సమారాలోని సుప్రసిద్ధ షియా మసీదును ఐఎస్ఐఎస్ దాడుల నుంచి కాపాడినది ఇరాన్ దళాలే. రష్యా కావాల్సిన ఆయుధ సంపత్తినంతటినీ అడగకుండానే పంపుతోంది. ఐఎస్ఐఎస్ తిరుగుబాటు వెనుక ఉన్నది సౌదీ అరేబియా అని అంతర్జాతీయ మీడియా ఢంకా బజాయించింది. ఆశ్చ ర్యకరంగా ఐఎస్ఐఎస్ ధాటికి ఇరాక్ సేనలు సరిహద్దుల నుంచి ఉపసంహరించుకోవడంతోనే... ఇరాక్ సరిహద్దులకు అది 30 వేల సైన్యాన్ని తరలించింది. అఫ్ఘాన్ నుండి సిరియా వరకు అమెరికా ఎక్కడికి పంపమంటే అక్కడికి సున్నీ జిహా దీలను తరలించడానికి సిద్ధంగా ఉండిన సౌదీ ఐఎస్ఐఎస్ ‘జిహాదీల’ విజయయాత్రకు ఎందుకు భయపడుతోంది?
మలికికి సహాయం అందించే విషయంలో అమెరికా కొంగ జపానికి, ఇరాక్ పరిణామాలు సౌదీ వెన్నులో చలి పుట్టించడానికి కారణం ఒక్కటే. గాజాపై యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్‌ను ‘ఖలీఫా’ మాటవరసకైనా ఖండించడం లేదు. ఆ దాడుల్లో అమాయక పౌరులు మరణిస్తుండటంపై వెల్లువె త్తుతున్న నిరసనకు భయపడి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యా హూ గాజా పౌర మరణాల పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ మొసలి కన్నీరు కార్చారు. ‘ఖలీఫా ఇబ్రహీం’ వద్ద అవి కూడా లేవు. తెలిసిగానీ తెలియకగానీ అభినవ ఖలీఫా యూదు ఇజ్రాయెల్‌కు ఆనందం కలిగించేలా అరబ్బు ప్రపంచంలో చిచ్చు రగిల్చాడు. ఇబ్రహీం కడుతున్న ఖలీఫా సామ్రాజ్యం పేక మేడ అప్పుడే కూలడం మొదలెంది. నైనివే రాష్ట్రంలో సున్నీ మిలీషియాలు ఐఎస్ఐఎస్ మూకలను తరమడం ప్రారంభించారు. సున్నీలలో అతి పెద్ద పార్టీ నేత ఆ రాష్ట్ర గవర్నర్ అల్ నుజాయిఫ్ ఐఎస్ఐఎస్ వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా బాగ్దాద్ లో మలికికి వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటు జరగనున్న దని పాశ్చాత్య మీడియా లీకులిస్తోంది. సీఐఏ... ఐఎస్ఐఎస్ ఆట ముగించి సైనిక కుట్ర ఆటకు తెరదీసిందా? కావచ్చు. కానీ అది సృష్టించిన ఐఎస్ఐఎస్ దానికి వ్యతిరేకంగానే పో రాటానికి దిగే రోజుల కోసం అది ఎదురు చూడక తప్పదు.
పిళ్లా వెంకటేశ్వరరావు