ఆ నలుగురి సహకారం మరచిపోలేను!
అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘పిల్ల జమీందార్’లోని ‘నీ చూపులోని విరజాజి వాన..’ పాట గుర్తుందా? వడ్డేపల్లి కృష్ణ రాసిన ఆ పాట సూపర్ హిట్. మొదటి పాటతోనే గేయ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. నేటితో వడ్డేపల్లి సినీ రంగ ప్రవేశం చేసి 35 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ - ‘‘చిన్నతనం నుంచి తెలుగు సాహిత్యమంటే ఇష్టం. ముఖ్యంగా సి.నారాయణరెడ్డిగారి రచ నలంటే ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను. నా మొదటి పాట భానుమతి దర్శకత్వం వహించిన ‘రచయిత్రి’ సినిమా కోసం రాశాను.
కానీ ఆ సినిమా ఆలస్యంగా విడుదల కావడంతో ‘పిల్ల జమీందార్’ నా మొదటి సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, దర్శకుడు సింగితం శ్రీనివాసరావు, నిర్మాత ఏఎం రత్నం లేకపోతే నేను ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండేవాణ్ణి కాదేమో. ఇప్పటివరకూ మొత్తం 200 పాటలు రాశాను. వాటితో పాటు ప్రైవేటు పాటలు కూడా రాశాను. 1910 నుంచి 2000 సంవత్సరం వరకూ లలిత సంగీత సాహిత్యంలో వచ్చిన మార్పుల మీద పరిశోధన చేసి, ఉస్మానియా నుంచి పీహెచ్డీ పట్టా కూడా తీసుకున్నాను.
1992లో బాలల మీద రాసిన ‘చిరుగజ్జెలు’ అనే గేయానికిగాను బాల సాహిత్య పురస్కారం అందుకున్నాను. ఈ గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పూణెలోని బాలభారతి స్కూల్లో నాలుగో తరగతిలో తెలుగు వాచకంలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాసిన జయహే, జయహే తెలంగాణ’ నృత్యరూపకానికి సాహిత్యం అందించాను. దీనివల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది. వివేకానంద విజయం, విశ్వకల్యాణం నృత్యరూపకాలు కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
‘విశ్వకల్యాణం’ బెంగాలీ భాషలోకి కూడా అనువాదమైంది. అమెరికాలో ప్రతి ఏటా నిర్వహించే ఆటా, తానా సభలకు వరుసగా స్వాగత సంగీత నృత్యరూపకాలు రాశాను కూడా. ఈ మధ్యే సాయికిరణ్ హీరోగా నటించిన ‘ఎక్కడికెళుతుందో మనసు’ సినిమాకు దర్శకత్వం వహించాను. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్‌లు రెడీ చేస్తున్నాను. అన్నీ కుదిరితే త్వరలో మళ్లీ మెగాఫోన్ పడతాను’’ అని అన్నారు.