Pillalmari
-
పురాతన దేవాలయాలు.. పిల్లలమర్రి శివాలయాలు
దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఆ ఊరు పేరు వినగానే పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు గుర్తుకొస్తాయి. అక్కడ కొలువైన శివుడు చెన్నకేశ్వరుడు భక్త జనానికి ఆరాద్య దైవంగా వెలుగొందుతున్నారు. అంతేకాకుండా పురాతన దేవలయాలతో అలరారుతున్న ఆ గ్రామం అత్యంత ప్రఖ్యాతిగాంచింది. సూర్యాపేట మండల పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలోని కాకతీయ కళామతల్లికి నిలయమై, ఎన్నో శివాలయాలకు వేదికైంది. "వాణి నా రాణి" అని చెప్పి మెప్పించిన పిల్లలమర్రి పిన వీరభద్రుడిని తన బిడ్డగా నిలుపుకున్న కమనీయ సీమ పిల్లలమర్రి. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కి వెళ్లే 65వ నెంబర్ జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ముఖధ్వారం ఉంది. అంతేకాదు మూసీ కాలువ పక్క నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లంగానే పిల్లలమర్రి గ్రామం వచ్చేస్తుంది. (చదవండి: ఆలుమగల బంధానికి అర్థం చెప్పారు.. ‘ఇదీ బంధమంటే..!’) శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు... పిల్లలమర్రి శివాలయాలు శిల్ప కళా సంపదకు పెట్టింది పేరు. కాకతీయులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాలం ఈ గ్రామానికి నిజంగా స్వర్ణయుగం. రేచర్లరెడ్డి వంశీయులు కాకతీయులు సేనానులుగా, మహా సామంతులుగా ఆమనగల్లు, ఎలకతుర్తి, పిల్లలమర్రి ప్రాంతాలను పరిపాలించారు. మహాసామంతుడైన రేచర్ల బేతిరెడ్డి ఆమనగల్లును రాజధానిగా చేసుకుని పాలించే రోజుల్లో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించారు. అనంతరం తన రాజధానిని పిల్లలమర్రికి మార్చి పిల్లలమర్రి బేతిరెడ్డిగా ప్రఖ్యాతి గాంచాడు. ఇప్పుడున్న గ్రామ ప్రాంతంలో పూర్వం ఒక గొప్ప వటవృక్షం (మర్రిచెట్టు) ఉండేది. అక్కడికి వేటకు వచ్చిన బేతిరెడ్డికి ఆ చెట్టు క్రింద ధనం లభించిందని, ఆ ధనంతో పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. రాతి దూలాలపై పురాణ గాథాలు..... క్రీ.శ 1195 నాటికి పిల్లలమర్రి బాగా ప్రసిద్ధి పొందింది. కాకతీయ రుద్రదేవుని మరణానంతరం తన తమ్ముడైన నామిరెడ్డికి మహాసామంత ఆధిపత్యం అప్పగించి బేతిరెడ్డి విశ్రాంతి తీసుకున్నాడు. రేచర్ల నామిరెడ్డి నిర్మించిన త్రికూటాలయంలో మూడు శివాలయాలున్నాయి. నామిరెడ్డి తన తండ్రిపేరు మీద కామేశ్వర, తన తల్లి పేరు మీద కాచేశ్వర, తన పేరు మీద నామేశ్వర లింగాలను ప్రతిష్టించాడు. ఈ దేవాలయ ప్రాంగణంలో మరో నామేశ్వరాలయం కూడా ఉంది. అది 1202లో నిర్మించబడింది. తెలుగు భాష మాట్లాడేవారందర్నీ మొదటిసారిగా ఏకం చేసిన వారు కాకతీయులు. రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరుకసాని పిల్లలమర్రిలో తన పేరుమీద ఎరుకేశ్వరాలయాన్ని నిర్మించి శాసనం వేయించింది. ఆలయం సమీపంలో సుబ్బ సముద్రాన్ని తవ్వించింది. దేవాలయంలో పూజల నిమిత్తం భూధానం చేసింది. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతి దూలాలపై భారత రామాయణ గాథలు, సముద్ర మధనం, వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. సప్తస్వరాలు పలికే రాతి స్తంభాలు... నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్త స్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తున్నాయి. నిర్మాణంలో ఇసుక పోసి ఏనుగులతో పెద్ద పెద్ద బండలను ఎక్కించినట్లు తెలిసింది. దేవాలయాల్లో నల్లని శిలలపై నగిషీలు, పద్మాలు, హంసలు, నృత్య భంగిమలు,వాయిద్యకారుల ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శివరాత్రికి ఐదు రోజుల పాటు జాతర... మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది దేవాలయాలు శివరాత్రి శోభకు ముస్తాబు చేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. (చదవండి: దేశానికే ఆదర్శం.. హైదరాబాద్) -
కరెంట్ కాటుకు ఇద్దరి బలి
పిల్లలమర్రి(సూర్యాపేటరూరల్) :తెల్లవారుజామునే కరెంట్ ఇద్దరిని కాటేసింది. మంగళవారం జిల్లాలోని సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలో గేదెను లేపబోయి మహిళ, పాలుపితికేందుకు వ్యవసాయ బావివద్దకు వెళ్తున్న రైతు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. వీరితో పాటు గేదె కూడా మృతిచెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు చోటు చేసుకున్నాయని మృతుల బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గేదెను లేపబోయి.. సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన బొమ్మగాని వెంకటయ్య భార్య కేశమ్మ(50)లకు చెందిన పాడి గేదె ఉంది. అది తెల్లవారుజామున ఇంటి ముందు గల విద్యుత్‌స్తంభం స్టేవైరుకు రాసుకోవడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. అది గమనించని ఓ మహిళ గేదె వీధిలో పడుకుందని కేశమ్మకు చెప్పింది. కాగా, కేశమ్మ నిద్రలేచి అక్కడకు వెళ్లి తమ గేదెను లేపే ప్రయత్నం చేసింది. గేదె అప్పటికే విద్యుదాఘాతంతో మృతిచెందగా కేశమ్మ దానిని పట్టుకోగా ఆమెకు కూడా విద్యుత్ ప్రసరణ జరిగి అక్కడికక్కడే మృతిచెందింది. అప్పటికే నిద్ర లేచిన కేశమ్మ కూతురు లక్ష్మి బయటకు వెళ్లి విద్యుత్ స్తంభం వద్ద తల్లి, గేదె కింద పడి ఉన్న సంఘటనను చూసింది. దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయగా గేదె తోక తగలడంతో కొంత దూరంలో ఎగిరిపడింది. లక్ష్మి లేచి ఇంట్లోకి వెళ్లి అన్న నగేష్‌కు విషయాన్ని వివరించింది. వెంటనే నగేష్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేశా డు. సంఘటన స్థలం వద్దకు వచ్చి చూసే వరకు తల్లి, గేదె మృతిచెంది ఉండడంతో బోరున విలపించాడు. గ్రామస్తులు విషయాన్ని ట్రాన్స్‌కో ఏఈ శ్రీనువాస్‌కు వివరించినా స్పదించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈ కార్యాలయం ఎదుట ఆందోళన ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కేశమ్మ మృతదేహంతో గ్రామస్తులు సూర్యాపేట డీఈ కార్యాలయం ఎదుట మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో హైవేపై రాస్తారోకో చేశారు. మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, సంఘటనకు కారకులైన వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రవణ్‌కుమార్ రాస్తారోకో వద్దకు చేరుకుని, విద్యుత్ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఆందోళన వద్దకు రావాలని డీఎస్పీ విద్యుత్ అధికారులను కోరినా ఎవరూ రాలేదు. ఆగ్రహించిన ఆందోళనకారులు మృతదేహాన్ని కార్యాలయంలోనే ఖననం చేస్తామనడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో సంబంధింత శాఖ అధికారులు కార్యాలయం చేరుకున్నారు.అందోళనకారులతో మాట్లాడి మృతురాలి కుటుంబానికి లక్షన్నర తక్షణ సాయంగా విద్యుత్ అధికారులు అందించారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ఇప్పించేందుకు కృషిచేస్తామని డీఈ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. ఆందోళనలో గ్రామసర్పంచ్ సోమగాని లింగస్వామిగౌడ్, రాపర్తి సైదాలు, రాపర్తి శ్రీను, సోమగాని సత్యనారాయణ, సోమగాని యాదగిరి, జెర్రిపోతుల శ్రీనువాస్, జే.యాదగిరి, సైదులు, రాపర్తి మహేష్, సట్టు జానయ్య, దాసరి లచ్చయ్య, వల్లాల సైదులుతో పాటు సుమారు 200 మంది పాల్గొన్నారు.