పైలట్ నిద్ర, ట్యాబ్‌తో కో-పైలట్ బిజీ!
మనం కారులో రాత్రిపూట వెళ్తుంటే డ్రైవర్‌కు నిద్ర రాకుండా ఉండేందుకు ముందు సీట్లో కూర్చున్న వాళ్లు వాళ్లతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. చూడబోతే ఇప్పుడు విమానాల్లో కూడా అలాగే మాట్లాడాల్సి వచ్చేలా ఉంది. ముంబై నుంచి బ్రసెల్స్ వెళ్తున్న విమానంలో పైలట్ హాయిగా నిద్రపోతుంటే, అదే సమయంలో మహిళా కో-పైలట్ తన ట్యాబ్‌లో బిజీగా ఉంది. అంతలో ఏమైందో తెలియదు గానీ, విమానం మాత్రం నిర్ధారిత ఎత్తు కంటే 5వేల అడుగులు కిందకు దిగిపోయింది. ఆ సమయంలో జెట్ ఎయిర్వేస్కు చెందిన ఈ బోయింగ్ 777 విమానంలో వెళ్తున్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. విమానం టర్కీలోని అంకారా గగనతలంలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
బాగా దూరాలు వెళ్లేటప్పుడు పైలట్లకు 'నియంత్రిత విశ్రాంతి' తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్లు కాక్‌పిట్‌లోనే కాసేపు పడుకోవచ్చు. అయితే ఆ సమయంలో కో-పైలట్ మాత్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. కానీ ఆమె కూడా తన ట్యాబ్‌లో బిజీగా ఉండి, అసలు విమానం కిందకు దిగిపోతున్న విషయాన్నే గుర్తించలేదు. అలా ఎందుకు జరిగిందన్న విషయాన్ని ఇప్పుడు డీజీసీఏ విచారించనుంది. ఈ విమానం 34వేల అడుగుల ఎత్తున ప్రయాణించాల్సి ఉంది. అయితే 29వేల అడుగుల ఎత్తునే ప్రయాణిస్తుండటంతో అంకారా ఏటీసీ ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే విమానానికి ప్రమాద హెచ్చరిక పంపింది. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేకపోతే విమానం ఏమయ్యేదో తలుచుకుంటేనే ఒక్కసారి గుండె గుభేలుమంటుంది. ఈ ప్రమాదం గురించి డీజీసీఏ జాయింట్ డీజీ లలిత్ గుప్తాకు ఓ ఎస్ఎంఎస్ కూడా వచ్చింది.
ఇటీవలి కాలంలో ఇరాక్, ఉక్రెయిన్ లాంటి ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో యూరోపియన్ ఏటీసీలు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. సరిగ్గా అదే అంశం పెను ప్రమాదం తప్పేలా చేసింది. ఇది చాలా తీవ్రమైన తప్పిదమని తేల్చిన జెట్ ఎయిర్వేస్ సంస్థ.. పైలట్లిద్దరినీ గ్రౌండింగ్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పైలట్ నిద్రపోతున్న సమయానికి మహిళా కో పైలట్ తన ఎలక్ట్రానిక్ ఫ్లైట్ బ్యాగ్ (ఈఎఫ్‌బీ) అనే టాబ్లెట్ చూసుకుంటున్నారు. అందులో విమానానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు లోడ్ అయి ఉంటాయి. అయితే, విమానం కిందకు దిగిపోతున్న విషయాన్ని ఆమె గుర్తించలేదు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)