ప్రైవేట్ సైన్యం మధ్య ఉల్లి తల్లి
పుణె : ఉల్లి చేసే తమాషాలు అన్నీ ఇన్నీ కావు. నిన్న దేశంలో ఉల్లి మాఫీయా పెరుగుతుందని పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ భావించింది. అంతే అనుకున్నదే తడవుగా దేశ సరిహద్దుల వెంట పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. అలాగే నేడు మహారాష్ట్రలోని చించ్వాడ్లోని పింప్రి మార్కెట్లో ఉల్లిపాయల రక్షణకు సాయుధ భద్రత సిబ్బందిని నియమించుకునేలా చేసింది. పింప్రీ - చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ మార్కెట్లో కొన్ని రోజుల కిందట సుమారు 400 కిలోల ఉల్లి చోరీకి గురైంది.
ఆ క్రమంలో ఉల్లి వ్యాపారులపై సదరు దొంగలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం వారి ఫిర్యాదుపై కనీసం స్పందించలేదు. పోలీసులు తీరు చూసిన సదరు వ్యాపారులు మార్కెట్లోని ఉల్లి తల్లిని మనమే రక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సొంత ఖర్చులతో ఆయుధాలతో కూడిన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు.