విషాదం మిగిల్చిన విహారయాత్ర
కాగజ్‌నగర్/కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ :
కాగజ్‌నగర్ మండలం మెట్పల్లి గ్రామ సమీపంలోని వాంకిడి వాగులో ఇద్దరు యువకులు గల్లంతై మృతిచెందారు. కాగజ్‌నగర్‌కు చెందిన కొందరు స్నేహితులు కలిసి వాంకిడి వాగు సమీపంలోకి విహార యాత్రకు వెళ్లారు. సరదాగా అందరూ కలిసి ఈత కొట్టగా ఇద్దరు గల్లంతై చనిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సర్‌సిల్క్ ఏరియాలో ఉన్న సుభాష్‌చంద్రబోస్ కాలనీకి చెందిన యువకులు బొద్దున సందీప్(23), బోనగిరి చందు(17), శ్రీకాంత్, వెంకటేశ్, అనిల్, రాకేశ్, అన్వేశ్, ఎన్.సాయికుమార్, అనిల్, సాయి, సురేశ్ సోమవారం ఉదయం మండలంలోని మెట్పల్లి గ్రామ సమీపంలో ఉన్న వాంకిడి వాగు వద్దకు విహార యాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు వంటలు చేసుకుని విందు చేసుకున్నారు.
అనంతరం ఈత కొట్టేందుకు వాగులో దిగారు. 4.30గంటల ప్రాంతంలో వాగులో నుంచి బయటకు రాగా.. సందీప్, చందు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఈతగాళ్లను తీసుకెళ్లారు. రాత్రి కావడంతో వెతికేందుకు వారు నిరాకరించారు. దీంతో కాగజ్‌నగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలం ఆసిఫాబాద్ పోలీసుల పరిధిలోకి వస్తుందని చెప్పారు. మంగళవారం ఉదయం ఆసిఫాబాద్‌కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసి కాగజ్‌నగర్ రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పడంతో తిరిగి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎట్టకేలకు ఉదయం 11గంటలకు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా సందీప్, చందు మృతదేహాలు లభించాయి. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు, సీఐ రహెమాన్, ఎస్సై తిరుపతి సందర్వించారు. మృతుల కుటుంబాలను టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుల్లపల్లి బుచ్చిలింగం, నాయకులు కమల్‌కిశోర్, మాజీ కౌన్సిలర్ తిలక్, అశోక్, మురళీగౌడ్ తదితరులు పరామర్శించారు.
ఆదుకుంటాడనుకున్న...
బాగా చదివి ఆదుకుంటారనుకుంటే ఆ కుటుంబాల్లో విషాదమే మిగిలింది. సుభాష్‌చంద్రబోస్ కాలనీకి చెందిన బొద్దున సుధాకర్, స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులు. సందీప్ పెద్ద కుమారుడు. 1997లో తండ్రి సుధాకర్ మృతిచెందడంతో తల్లి స్వరూప విస్తారాకులు కుడుతూ కొడుకులను చదివిస్తోంది. వరంగల్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన సందీప్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. హౌస్ వైరింగ్ చేస్తూ తల్లికి చేదోడుగా ఉంటున్నాడు. ‘ఉద్యోగం వచ్చి ఆదుకుంటాడని అనుకున్న..’ అంటూ స్వరూప విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సదయ్య, రాజేశ్వరి దంపతుల చిన్న కుమారుడు చందు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేశాడు. రేపల్లెవాడలోని ఐటీఐలో చేరేందుకు ఫీజు చెల్లించాడు. ఎంతో భవిష్యత్ ఉన్న కొడుకు కళ్లముందే మరణించడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అనుమానాస్పద మృతిగా కేసు
వారిద్దరి మృతిని అనుమానాస్పదంగా భావిస్తూ కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తిరుపతి తెలిపారు. సందీప్ తల్లి స్వరూప, చందు తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.