ఇంటికి - ఒంటికి
గులాబి పువ్వై...
గులాబి పూలను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. చాలామందికి వాటిని తల్లో పెట్టుకోవడం కన్నా.. వాటిని చూస్తూ ఉండటమే ఇష్టం.. అందుకే ఇంట్లో ప్లవర్ వాజుల్లో వాటిని పెట్టుకుంటారు. కానీ ఒరిజినల్ పూలు ఒక్కరోజుకు మించి తాజాగా ఉండవు. కాబట్టి ప్లాస్టిక్ లేదా పేపర్ గులాబీలతో అడ్జస్ట్ కాక తప్పదు. అలాంటి పేపర్ గులాబీలను ఇకపై షాపుల్లోంచి కొనుక్కురాకుండా ఇంట్లోనే తయారు చేసుకుందాం.. ఇందులో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. బయట దొరికే ఒరిజినల్ గులాబీలో లేని రంగులనూ మీ పేపర్ గులాబీల్లో చూసుకోవచ్చు. వీటి తయారీని చూద్దాం.
కావలసినవి: రంగురంగుల పేపర్లు, పెన్, కత్తెర, గ్లూ, స్టిక్స్
తయారీ: ముందుగా మీకు నచ్చిన రంగుకాగితంపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా సర్కిల్స్ గీసుకోవాలి. ఎన్ని సైజుల్లో కావాలంటే అన్ని సర్కిల్స్ గీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కత్తెర సాయంతో స్ప్రింగ్స్‌లా కట్ చేసుకోవాలి. ఎన్ని గులాబీలు కావాలనుకుంటే అన్ని కాగితాలను ఒకదానిపై ఒకటి లేయర్స్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు విడిగా ఒక్కో స్ప్రింగ్ పేపర్‌ను తీసుకొని రోల్ చేసుకుంటూ పోవాలి. అది గులాబి షేప్‌లోకి రాగానే.. వాటి కింది భాగంలో ఓ స్టిక్ పెట్టి, గ్లూతో అతికించాలి. తర్వాత ఈ గులాబీలను ప్లవర్వాజుల్లో పెట్టి అలంకరించుకోవచ్చు. అంతేకాదు.. ఈ గులాబీలతో విండ్చైమ్స్ను అందంగా తయారుచేసుకోవచ్చు. అలాగే ఫొటోల్లో కనిపిస్తున్న విధంగా వీటితో ఇంటిని ఎలాగైనా అలంకరించొచ్చు.
జీన్స్‌కు జోడీ...
అలంకరణ విషయంలో యువత ఒకప్పటిలా లేదు.. ఎలాంటి డ్రెస్‌కి ఎలాంటి జ్యుయెలరీ వేసుకోవాలనే విషయంలో క్లారిటీతో ఉంది. అంతే కదా.. చుడీదార్లకు సెట్ అయ్యే జ్యుయెలరీ జీన్స్ మీదకు అసలు సూట్ అవదు. అలాగే జీన్స్ తరహానే వేరు. ఒక్కసారి పక్కనున్న ఫొటోలను చూడండి.. జీన్స్ మీదకు ఎలాంటి నెక్లేస్, బ్రేస్లెట్, స్కార్ఫ్‌లు సెట్ అవుతాయో మీకే అర్థమవుతుంది. ఫ్యాషనబుల్‌గా కనిపిస్తున్న వీటికి పైసా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇంట్లోనే.. అదీ పాతబడిన టీ-షర్ట్స్‌తో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
కావలసినవి: పాత టీ-షర్ట్స్, కత్తెర, బ్రేస్లెట్ హుక్స్, ఓల్డ్ బ్యాంగిల్స్
తయారీ: టీ-షర్ట్‌ను ఫొటోలో కనిపిస్తున్న విధంగా కత్తెరతో అడ్డంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలా అండర్ ఆర్మ్ వరకు కట్ చేసుకొని, ముక్కలను ఒక బంచ్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బంచ్లోని రింగ్స్‌ను తీసుకొని జ్యుయెలరీ స్కార్ఫ్‌గా మార్చుకోవచ్చు. అలా వివిధ రంగుల రింగ్స్‌ను ఎంచుకొని మెడలో వేసుకుంటే ఆ అందమే వేరు.
అలాగే బ్రేస్లెట్ల కోసం మూడు సన్నని ముక్కలను తీసుకొని.. జడలా అల్లి చివర్లో ఒక హుక్ పెడితే సరి. అలాగే ఓల్డ్ బ్యాంగిల్స్‌కు ఈ టీ-షర్ట్ ముక్కలను చుడితే.. ఆ గాజులు భలేగా ఉంటాయి. అంతేకాదు, కావాలంటే వీటికి పూసలను చేర్చుకోవచ్చు. ఇకపై రంగు రంగుల పాత టీ షర్ట్స్‌ను భద్రంగా దాచుకుంటారు కదూ...