కల్లు అనుకుని ఫినాయిల్ తాగేశాడు..
నల్లకుంట: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి కల్లు అనుకుని ఫినాయిల్ తాగి చనిపోయాడు. నల్లకుంట ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాలివీ.. నల్లకుంట బాయమ్మలేన్లో శ్రీనివాస్(40) తన సోదరి నాగమణితో కలసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. శ్రీనివాస్ వికలాంగుడు కాగా, నాగమణి కుషాయిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుంటుంది.
ఏ పనీ చేయలేని శ్రీనివాస్ ఇంటి వద్దే ఉంటున్నాడు. మద్యానికి బానిసైన అతడు శుక్రవారం సాయంత్రం బాత్రూంలో ఉన్న ఫినాయిల్ బాటిల్ చూసి కల్లు అనుకుని తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ శనివారం చనిపోయాడు. నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.