పీణ్యా టు మల్లేశ్వరం మెట్రో పరుగులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని పీణ్యా నుంచి మల్లేశ్వరంలోని సంపిగె రోడ్డు వరకు మెట్రో రైలు సంచారం శనివారం ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి రాజాజీ నగర స్టేషన్లో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఈ రైలుకు లాంఛనంగా పచ్చ జెండా ఊపారు. అనంతరం కంఠీరవ స్టేడియంలో మెట్రో రెండో దశ పనులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శంకు స్థాపన చేశారు. మెట్రో రీచ్-3గా వ్యవహరించే ఈ పనులకు మొత్తం 1.30 లక్షల టన్నుల సిమెంటును వినియోగించారు.
44,500 టన్నుల స్టీల్, 2,900 టన్నుల హైటెన్షన్ తీగలను ఉపయోగించారు. మొత్తం 395 కాంక్రీటు పిల్లర్లు నిర్మించగా, నాలుగు వేల మంది కార్మికులు, మూడు వందల మంది ఇంజనీర్లు పనుల్లో పాలు పంచుకున్నారు. ఈ మార్గంలోని మొత్తం 10 స్టేషన్లలో 30 ఏళ్లకు సరిపడా సదుపాయాలను ప్రయాణికులకు కల్పించారు. కాగా ఈ రైళ్లకు ఫీడర్ సర్వీసులుగా మెజిస్టిక్ నుంచి సంపిగె రోడ్డు వరకు శనివారం నుంచి బీఎంటీసీ షటిల్ సర్వీసులను నడపనున్నారు. ఎంజీ రోడ్డులోని మెట్రో స్టేషన్ నుంచి కూడా ఫీడర్ సర్వీసులను నడపడానికి బీఎంటీసీ సన్నాహాలు చేస్తోంది.