నీటి పంపింగ్ ప్రారంభం
భద్రకాళి జలాశయానికి నీరు
- పైపులైన్ లీకేజీతో వడ్డేపల్లి చెరువుకు బ్రేక్
- మరమ్మతులకు సన్నాహాలు
కార్పొరేషన్ : కరీంనగర్ ఎల్ఎండీ నుంచి విడుదలైన మంచినీరు కాకతీయ కెనాల్ ద్వారా శుక్రవారం రాత్రి నగరానికి చేరుకోవడంతో శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ ఇంజినీర్లు సమ్మర్ స్టోరేజీల్లోకి పంపింగ్ ప్రక్రియ ప్రారంభించారు. దేశాయిపేట కెనాల్ ఆఫ్‌టెక్ పాయింట్ నుంచి భద్రకాళి చెరువులోకి రెండు మోటార్ల ద్వారా పంపింగ్ కొనసాగుతోంది. హన్మకొండ కేయూసీ ఫిల్టర్‌బెడ్ కెనాల్ ఆఫ్‌టెక్ పాయింట్ నుంచి వడ్డేపల్లి చెరువులోకి పంపింగ్ చేసే క్రమంలో నీటి ఉధృతికి సమ్మయ్యనగర్ వద్ద 1000 ఎంఎం డయా పైపులైన్ లీకుకావడంతో పంపింగ్ నిలిపివేశారు. పైపులైన్ మరమ్మతు కోసం హైదరాబాద్ జలమండలి నిపుణులను రప్పిస్తున్నామని, ఆదివారం మధ్యాహ్నంలోగా వెల్డింగ్ పనులు పూర్తి చేసి పంపింగ్ ప్రారంభిస్తామని బల్దియా ఎస్ఈ ఉపేంద్రసింగ్ తెలిపారు.
మరోవైపు వరంగల్‌లోని దేశాయిపేట, కేయూ, వడ్డేపల్లిలో మూడు చొప్పున ఉన్న మొత్తం తొమ్మిది ఫిల్టర్బెడ్లు రన్ అవుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఆదివారం నుంచి తాగునీరు సరఫరా చేసే అవకాశాలున్నాయి. ఇందుకోసం మోటార్లు, గేట్లు, వాల్వ్‌లను ఇంజినీర్లు సిద్ధం చేస్తున్నారు. ఎల్ఎండీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా వస్తున్న నీటిని మళ్లించకుండా నిఘా కొనసాగుతోంది. రోజుకు 600 క్యూసెక్కుల నీటిని మాత్రమే 20 రోజుల పాటు విడుదల చేయాలని బల్దియా ఎస్ఈ ఉపేంద్రసింగ్ ఎల్ఎండీ ఎస్ఈ సుధాకర్‌రెడ్డిని ఫోన్ ద్వారా కోరారు. కమిషనర్ అందుబాటులో లేనందున ఆయన వచ్చాక లేఖ పంపనున్నట్లు తెలిపారు.