సమస్యలు సవాలక్ష
పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. వేసవిలో అయితే మరీ కష్టంగా ఉంటోంది. పైపు లైను లీకేజీలతో నీరు కలుషితమవుతోంది. దీంతో మంచినీరు కొని తాగాల్సి వస్తోంది.
పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నం. కాలువల్లో నీరు సక్రమంగా ముందుకు పారడం లేదు. దీంతో దోమలతో అల్లాడిపోతున్నాం. వేకాదు.. మరెన్నో సమస్యలను సత్తెనపల్లి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నారు. జనాభాకు సరిపడా మంచినీరు సమృద్ధిగా ఉన్నా తరచూ పైపుల లీకేజీల కారణంగా మంచినీరు అందడం లేదు. రూ.14.50 కోట్లతో లక్కరాజుగార్లపాడు రోడ్డులో 120 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేసి చెరువు తవ్వించారు.
రూ.20.06 కోట్ల యూఐడీఎస్ఎస్ఎంటీ నిధులు, హడ్కో కింద రూ.14 కోట్లు ఖర్చు చేసి రిజర్వాయర్లు, సమ్మర్ స్టోరేజీ, ఫిల్టరేషన్ ప్లాంట్లు, ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. 60 కిలోమీటర్ల వరకు పైపులైను ఏర్పాటు చేశారు. తరచూ పైపులైనుల లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతుండటంతో పట్టణ ప్రజలు డబ్బా నీటిని కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి నెలకొంది. శివారు కాలనీలకు ట్యాంకర్ల నీరే గత్యంతరం.
పట్టణంలోని అన్ని వార్డుల్లో పందుల స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రహదారులపైకి కూడా వచ్చి వాహనచోదకులను ఇబ్బందులు పెడుతున్నాయి. వాటి దాడిలో స్థానికులు గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. పురపాలక సంఘ పరిధిలో కొన్ని చోట్ల డ్రెయినేజీలు ఆక్రమణలకు గురయ్యాయి.
పట్టణం మొత్తం మీద మురుగునీరు పారేందుకు సక్రమమైన వ్యవస్థ లేదు. పారిశుద్ధ్యానికి ఏడాదికి రూ.1.80 కోట్లు పురపాలక సంఘం ఖర్చు చేస్తుంది. రోజుకు 48 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ చేస్తున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు చేర్చాలి. అలాకాకుండా రైల్వేస్టేషన్ రోడ్డులో ఎక్కడపడితే అక్కడ నిల్వ చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
12వ ఆర్థిక సంఘం నిధులు 1.50 కోట్లు ఖర్చు చేసినా పూర్తిస్థాయిలో డంపింగ్ నిర్మాణం మాత్రం జరుగలేదు.పట్టణంలోని రహదారులను సిమెంటు రోడ్లుగా మార్చారు. కొన్ని చోట్ల సిమెంటు రోడ్లు బీటలు వేసి ఇందులోని రాళ్లు పైకిలేచి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
వర్షం వస్తే సత్తెనపల్లి లోతట్టు ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండదు. ప్రధానంగా నాగన్నకుం ట, సుందరయ్య కాలనీ, వెంకటపతి కాలనీ, దోభీ ఘాట్ ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షం కురిసినా వర్షపు నీరు గృహాల్లోకి చేరుతుంది. ఈ సమస్య పరిష్కారానికి స్ట్రామ్‌వాటర్ డ్రెయిన్ నిర్మాణమే మార్గమని భావి ంచినప్పటికీ ప్రతిపాదనలు పంపారే తప్ప ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు.
పట్టణంలో ఏ వార్డులో చూసినా విద్యుద్దీపాలు సరిగా వెలగక అలంకార ప్రాయంగా ఉంటున్నాయి. ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ పరిస్థితి దాదాపు ఇంతే. మున్సిపాలిటీ నెలకు విద్యుత్‌బిల్లుల కింద రూ.2.10 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. దీని నిర్వహణకు రూ.50 నుంచి రూ.లక్ష వరకు అవుతున్నాయి. ఇదిలా ఉంటే పట్టణంలో లక్కరాజుగార్లపాడు బస్టాండ్‌సెంటర్, ఎఫ్‌సీఐ ప్రాంతాల్లో కొన్ని వీధి దీపాలు నిత్యం వెలుగుతూ విద్యుత్ వృధా అవుతుంది. దీంతో నెలకు రూ.30 వేల విద్యుత్ వృధాగా పోతోంది.సత్తెనపల్లిలో పార్కు ఏరియా అని పేరుంది తప్ప, అక్కడ సేద తీరడానికి పార్కు మాత్రం లేదు. రైల్వేస్టేషన్ రోడ్డులోని చెరువు స్థలం పార్కుగా నిర్మించేందుకు రూ.2.2 కోట్లు ఖర్చు చేశారు. పూర్తిస్థాయిలో పనులు జరుగకపోవడంతో ఇంకా వాడుకలోకి రాలేదు.
పట్టణంలో పూర్తిస్థాయిలో బైపాస్ రహదారులు లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 50వేల పైనే వాహనాలు పట్టణంలోకి వచ్చి పోతుండటంతో ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది.
కోతుల బెడద ఎక్కువగా ఉంది.
పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పార్కు ఏరియాలో కోతులు ఇళ్లపైకి గుంపులుగా చేరి దుస్తులు, వస్తువులను తీసుకెళ్లడం, పిల్లలపైకి వచ్చి గాయపర్చడం వంటివి చేస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు.
చెత్తను నిర్వహణ సరిగా లేదు..
పట్టణంలో సేకరించిన చెత్తచెదారాన్ని సక్రమంగా డంపింగ్ యార్డుకు పారిశుద్ధ్య కార్మికులు చేర్చడం లేదు. రైల్వేస్టేషన్ రోడ్డులో రహదారి పక్కన పోస్తున్నారు. దీంతో రాకపోకల సమయంలో దుర్గంధం భరించలేకపోతున్నాము.