Piramal Healthcare
-
రిలయన్స్ సాధారణ బీమాపై కన్ను
న్యూఢిల్లీ: రుణ పరిష్కార ప్రణాళికల్లో ఉన్న రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలుకి ప్రయివేట్ రంగ కంపెనీలు పిరమల్ గ్రూప్, జ్యూరిక్ ఇన్సూరెన్స్ ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ భాగస్వామ్య ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ) ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రుణ భారంతో కుదేలైన రిలయన్స్ క్యాపిటల్ దివాలా చట్ట(ఐబీసీ) చర్యలను ఎదుర్కొంటోంది. దీనిలో భాగంగా సాధారణ బీమా అనుబంధ సంస్థ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పిరమల్, జ్యూరిక్ విడిగా నాన్‌బైండింగ్ బిడ్స్ దాఖలు చేశాయి. రెండు సంస్థలూ ఏర్పాటు చేయనున్న ఎస్పీవీలో చెరి సగం(50 శాతం చొప్పున) వాటాలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ కోసం విడిగా బిడ్‌ను వేసినట్లు జ్యూరిక్ వెల్లడించింది. రిలయన్స్ సాధారణ బీమా బిజినెస్ విలువను పిరమల్ రూ. 3,600 కోట్లు, జ్యూరిక్ రూ. 3,700 కోట్లుగా మదింపు చేశా యి. అయితే అసలు విలువ రూ. 9,450 కోట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క రిలయన్స్ క్యాపిటల్ రుణ పరిష్కార ప్రణాళికను పర్యవేక్షిస్తున్న పాలనాధికారి, సీవోసీ బిడ్స్ దాఖలు గడువును అక్టోబర్ 30వరకూ పొడిగించాయి. -
స్వాతిముత్యం: ఆరోగ్యం ఆనందం
చాలామంది వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని రెండు ప్రపంచాలు చేసుకుంటారు. సరిహద్దులు గీసుకుంటారు. స్వాతి పిరామల్‌కు మాత్రం అలాంటి సరిహద్దులు లేవు. తనకు వైద్యరంగం అంటే ఎంత ఇష్టమో, ఇష్టమైన వంటకాలను చేయడం అంటే కూడా అంతే ఇష్టం. స్వాతి ఆధ్వర్యంలో జరిగే బోర్డ్ మీటింగ్‌లలో హాట్ హాట్ చర్చలే కాదు, ఆమె వండిన హాట్ హాట్ వంటకాలు కూడా దర్శనమిస్తాయి. ‘ఉరుకులు, పరుగులు వద్దు. కూల్‌గా, నవ్వుతూ పనిచేద్దాం’ అని తరచు చెప్పే శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త స్వాతి పిరామల్ తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌరపురస్కారం ‘ది షెవాలియే డి లా లీజియన్ దానర్ ఆర్ నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ అందుకున్నారు. అంతగా పరిచయం అక్కర్లేని పేరు స్వాతి పిరామల్. సంప్రదాయ గుజరాతీ కుటుంబానికి చెందిన స్వాతి తొలిసారి అడుగుపెట్టింది మాత్రం తనకు ఎంతమాత్రం పరిచయం లేని రంగంలోకి! ఆస్ట్రేలియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నికోలస్ లేబోరేటరీస్ కొనుగోలు చేసినప్పుడు తనకు, భర్త అజయ్ పిరామల్‌కు బొత్తిగా ఏమీ తెలియదు. తన చేతిలో మాత్రం ఎంబీబీయస్ డిగ్రీ ఉంది. నడుస్తూ నడుస్తూనే, ప్రయాణిస్తూనే ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు. ఆ కష్టం వృథా పోలేదు. అనతి కాలంలోనే కంపెనీ అగ్రస్థానంలోకి వెళ్లింది. ఈ రంగానికి సంబంధించిన పనితీరు విషయానికి వస్తే ‘ఇలాగే’ అన్నట్లుగా ఉండేది. ‘ఇలా కూడా చేయవచ్చు’ అని కూల్‌గా నిరూపించింది స్వాతి పిరామల్. ‘వ్యక్తిగత, వృత్తిజీవితాలకు మధ్య ఉండే సరిహద్దు రేఖను స్వాతి చెరిపేశారు’ అనే మాట వినబడుతుంటుంది. అయితే ఈ కామెంట్‌ను ఆమె ప్రశంసగానే స్వీకరిస్తుంది. ఇంట్లో వంట చేస్తూనే, టీ తయారు చేస్తూనే క్లయింట్స్‌తో స్వాతి మాట్లాడే దృశ్యం సా«ధారణం. చాలా సందర్భాల్లో క్లయింట్స్ ఆమె ఆతిథ్యం స్వీకరిస్తూనే వ్యాపార విషయాలు మాట్లాడుతుంటారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే స్వాతి తన బంధువులు, స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్నట్లు అనిపిస్తుంది తప్ప క్లయింట్స్‌తో కలిసి బిజినెస్ విషయాలు చర్చిస్తున్నట్లుగా ఉండదు! ‘ఔషధాలను అమ్మడానికి మాత్రమే మా పని పరిమితమైనది కాదు. సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ముందు జాగ్రత్తలు సూచించి, ఆచరించేలా చేయడం కూడా’ అంటుంది స్వాతి పిరామల్. ఇండియా అపెక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించిన స్వాతి పిరామల్ సైన్స్, ఔషధరంగాల్లో సేవలు, భారత్–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి చేస్తున్న కృషికి తాజాగా ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంది. ‘మీ ఖాతాలో ఇన్ని విజయాలు ఉన్నాయి కదా, మీరు ఏ విజయాన్ని చూసి ఎక్కువ గర్వపడతారు?’ అని అడిగితే – ‘ఏదీ లేదు’ అని గలగలమని నవ్వుతుంది స్వాతి. మనం ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే ఇలా అంటుంది... ‘నా మనవరాలు తన రిపోర్ట్ కార్డ్‌తో నవ్వుతూ నా వైపు పరుగెత్తుకు వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఈ ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉన్నట్లు గర్వపడతాను’. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పిరామల్ గ్రూప్ వైస్–చైర్పర్సన్ స్వాతి పిరామల్ ఎన్నో విజయాలు దక్కించుకున్న పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. ‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్న వ్యక్తి. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టక ముందు మెడికల్ స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించేది. ఆరోగ్య విషయాలపై వీధి నాటికలు తయారు చేసి ఫ్రెండ్స్‌తో కలిసి వాటిలో నటించేది. ప్రస్తుతం ‘పిరామల్ ఫౌండేషన్’ తరపున సామాజికసేవా కార్యక్రమాలు చేపడుతోంది. ‘ప్రజల ఆరోగ్యం, ఆవిష్కరణలు, కొత్త ఔషధాలపైనే నా ప్రధాన దృష్టి’ అని చెబుతుంది స్వాతి పిరామల్. -
అంబానీ వియ్యంకుడంటే అంతేమరి!
సాక్షి, అమరావతి: పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చి, కమీషన్లు దండుకునే పనిలో ప్రభుత్వ పెద్దలు మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ‘104’ వాహనాల (చంద్రన్న సంచార చికిత్స) నిర్వహణను పిరమాల్ స్వాస్థ్య అనే బడా కార్పొరేట్ సంస్థ దక్కించుకుంది. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ వియ్యంకుడికి చెందినదే ఈ పిరమాల్ సంస్థ. అంబానీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సంబంధాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ‘104’ వాహనాల నిర్వహణ టెండర్‌ను 2016లో వక్రమార్గంలో పిరమాల్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయల బిల్లులు తీసుకుంది. ‘104 ’వాహనాలు ప్రభుత్వానివే, మందులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. వాహనాలకు డీజిల్, సిబ్బందికి వేతనాలకు గాను ఓక్కో వాహనానికి ప్రభుత్వం నెలకు రూ.2.44 లక్షలు చెల్లిస్తోంది. నిర్వహణ పేరిట ఈ సొమ్మంతా పిరమాల్ ఖాతాలోకే చేరుతోంది. కానీ, ఆ సంస్థ ఒక్కో వాహనం నిర్వహణకు నెలకు రూ.లక్ష కూడా ఖర్చు చేయడం లేదు. అంటే ఒక్కో వాహనం పేరిట అక్షరాలా రూ.1.44 లక్షలు జేబులో వేసుకుంటోంది. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ ఒక్కో వాహనానికి నెలకు రూ.2.44 లక్షల చొప్పున మూడేళ్లలో పిరమాల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.244 కోట్లు చెల్లించింది. 2019 మార్చి 31వ తేదీతో కాంట్రాక్టు కాలపరిమితి ముగియనుంది. ఈ సంస్థ పేదలకు సక్రమంగా మందులు ఇవ్వకున్నా, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎలాగూ గడువు ముగుస్తోంది కాబట్టి ఈలోగా టెండర్ ప్రక్రియ పూర్తిచేసి, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరో సంస్థకు వాహనాల నిర్వహణ కాంట్రాక్టు ఇవ్వాలని హైకోర్టు 2018 అక్టోబర్‌లో స్పష్టం చేసింది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టెండర్ ప్రక్రియను ప్రారంభించలేదు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేసింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ సాకుతో మళ్లీ పిరమాల్ సంస్థకే ‘104’ వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. దీని వెనుక ఉన్న లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ‘104’ అంబులెన్స్‌ల దుస్థితి ఇదీ... + రాష్ట్రంలో మెజారిటీ వాహనాలకు ఫిట్నెస్ లేదు. + ఇన్వర్టర్, బ్యాటరీలు లేవు. టైర్లు అరిగిపోయినా మార్చడం లేదు. + నెలలో 15,432 గ్రామాలకు వాహనాలు వెళ్లి మందులు ఇవ్వాలి. ఇందులో సగం గ్రామాలకు కూడా వాహనాలు వెళ్లడం లేదు. + కొన్ని వాహనాలు మరమ్మతులకు గురై షెడ్డుకే పరిమితం అయ్యాయి. కానీ, అవి గ్రామాల్లో తిరుగుతున్నట్టు చూపించి నెలకు రూ.2.44 లక్షల చొప్పున తీసుకుంటున్నారు. + 2018 ఆగస్ట్ నుంచి సిబ్బందికి ట్రావెలింగ్ అలవెన్సు, డిసెంబరు నుంచి డెయిలీ అలవెన్సు చెల్లించడం లేదు. + వాహనాలు మరమ్మతులకు గురైతే పట్టించుకోవడం లేదు. + వాహనంలో 60 రకాల మందులు ఉండాలి. కానీ, 27 రకాల మందులు కూడా ఉండడం లేదు. + గర్భిణులకు, మధుమేహ రోగులకు, మూర్ఛ సంబంధిత జబ్బులకు వాహనాల్లో మందులు లేవు. + ప్రతి వాహనానికి ఒక డాక్టరు ఉండాలి. కానీ, 60 శాతం వాహనాల్లో డాక్టర్లు లేరు. -
దేశీయ భాగస్వామి వాటాపై వొడాఫోన్ కన్ను
న్యూఢిల్లీ: దేశీయ టెలికం సంస్థ వొడాఫోన్ ఇండియాలో పూర్తి వాటాను సొంతం చేసుకోవాలని బ్రిటిష్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ యోచిస్తోంది. దీనిలో భాగంగా దేశీయ భాగస్వాములు అజయ్ పిరమల్(పిరమల్ హెల్త్‌కేర్), అనల్జిత్ సింగ్ వాటాలను కొనుగోలు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తద్వారా తమ వాటాను 100%కు చేర్చుకోవాలని వొడాఫోన్ భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ అంశంపై కంపెనీ స్పందించనప్పటికీ, ఎస్సార్ గ్రూప్ నుంచి వాటాను కొనుగోలు చేయడం ద్వారా 2011లో తమ వాటాను 74%కు పెంచుకున్న విషయం విదితమే. అప్పటి వొడాఫోన్ ఎస్సార్‌లో ఎస్సార్కుగల 33% వాటాను 2011 జూలైలో 546 కోట్ల డాలర్లకు బ్రిటిష్ వొడాఫోన్ సొంతం చేసుకుంది. కాగా, మరోవైపు 2011 ఆగస్ట్‌లో రూ. 2,900 కోట్లను వెచ్చించడం ద్వారా వొడాఫోన్ ఇండియాలో పిరమల్ హెల్త్‌కేర్ 5.5% వాటాను దక్కించుకుంది. ఆపై తమ వాటాను 11%కు పెంచుకుంది. ఇక మ్యాక్స్ ఇండి యా ప్రమోటర్ అనల్జిత్ సింగ్‌కు సైతం వొడాఫోన్ ఇండియాలో 6% వాటా ఉంది.