అంబానీ వియ్యంకుడంటే అంతేమరి! | Andhra Pradesh 104 Service | Sakshi
Sakshi News home page

అంబానీ వియ్యంకుడంటే అంతేమరి!

Published Thu, Mar 14 2019 10:45 AM | Last Updated on Thu, Mar 14 2019 10:45 AM

Andhra Pradesh 104 Service - Sakshi

సాక్షి, అమరావతి: పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కార్పొరేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చి, కమీషన్లు దండుకునే పనిలో ప్రభుత్వ పెద్దలు మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ‘104’ వాహనాల (చంద్రన్న సంచార చికిత్స) నిర్వహణను పిరమాల్‌ స్వాస్థ్య అనే బడా కార్పొరేట్‌ సంస్థ దక్కించుకుంది. రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేష్‌ అంబానీ వియ్యంకుడికి చెందినదే ఈ పిరమాల్‌ సంస్థ. అంబానీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సంబంధాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

‘104’ వాహనాల నిర్వహణ టెండర్‌ను 2016లో వక్రమార్గంలో పిరమాల్‌ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయల బిల్లులు తీసుకుంది. ‘104 ’వాహనాలు ప్రభుత్వానివే, మందులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. వాహనాలకు డీజిల్, సిబ్బందికి వేతనాలకు గాను ఓక్కో వాహనానికి ప్రభుత్వం నెలకు రూ.2.44 లక్షలు చెల్లిస్తోంది. నిర్వహణ పేరిట ఈ సొమ్మంతా పిరమాల్‌ ఖాతాలోకే చేరుతోంది. కానీ, ఆ సంస్థ ఒక్కో వాహనం నిర్వహణకు నెలకు రూ.లక్ష కూడా ఖర్చు చేయడం లేదు. అంటే ఒక్కో వాహనం పేరిట అక్షరాలా రూ.1.44 లక్షలు జేబులో వేసుకుంటోంది.  

హైకోర్టు ఆదేశాలు బేఖాతర్‌  
ఒక్కో వాహనానికి నెలకు రూ.2.44 లక్షల చొప్పున మూడేళ్లలో పిరమాల్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.244 కోట్లు చెల్లించింది. 2019 మార్చి 31వ తేదీతో కాంట్రాక్టు కాలపరిమితి ముగియనుంది. ఈ సంస్థ పేదలకు సక్రమంగా మందులు ఇవ్వకున్నా, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎలాగూ గడువు ముగుస్తోంది కాబట్టి ఈలోగా టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మరో సంస్థకు వాహనాల నిర్వహణ కాంట్రాక్టు ఇవ్వాలని హైకోర్టు 2018 అక్టోబర్‌లో స్పష్టం చేసింది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టెండర్‌ ప్రక్రియను ప్రారంభించలేదు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేసింది. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ సాకుతో మళ్లీ పిరమాల్‌ సంస్థకే ‘104’ వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. దీని వెనుక ఉన్న లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు.   

ప్రస్తుతం ‘104’ అంబులెన్స్‌ల దుస్థితి ఇదీ...
+ రాష్ట్రంలో మెజారిటీ వాహనాలకు ఫిట్‌నెస్‌ లేదు.   
+ ఇన్వర్టర్, బ్యాటరీలు లేవు. టైర్లు అరిగిపోయినా మార్చడం లేదు.  
+ నెలలో 15,432 గ్రామాలకు వాహనాలు వెళ్లి మందులు ఇవ్వాలి. ఇందులో సగం గ్రామాలకు కూడా వాహనాలు వెళ్లడం లేదు.  
+ కొన్ని వాహనాలు మరమ్మతులకు గురై షెడ్డుకే పరిమితం అయ్యాయి. కానీ, అవి గ్రామాల్లో తిరుగుతున్నట్టు చూపించి నెలకు రూ.2.44 లక్షల చొప్పున
తీసుకుంటున్నారు.   
+ 2018 ఆగస్ట్‌ నుంచి సిబ్బందికి ట్రావెలింగ్‌ అలవెన్సు, డిసెంబరు నుంచి డెయిలీ అలవెన్సు చెల్లించడం లేదు.  
+ వాహనాలు మరమ్మతులకు గురైతే పట్టించుకోవడం లేదు.   
+ వాహనంలో 60 రకాల మందులు ఉండాలి. కానీ, 27 రకాల మందులు కూడా ఉండడం లేదు.  
+ గర్భిణులకు, మధుమేహ రోగులకు, మూర్ఛ సంబంధిత జబ్బులకు వాహనాల్లో మందులు లేవు.  
+ ప్రతి వాహనానికి ఒక డాక్టరు ఉండాలి. కానీ, 60 శాతం వాహనాల్లో డాక్టర్లు లేరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement