Chandranna sanchara chikitsa
-
అంబానీ వియ్యంకుడంటే అంతేమరి!
సాక్షి, అమరావతి: పేదల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చి, కమీషన్లు దండుకునే పనిలో ప్రభుత్వ పెద్దలు మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ‘104’ వాహనాల (చంద్రన్న సంచార చికిత్స) నిర్వహణను పిరమాల్ స్వాస్థ్య అనే బడా కార్పొరేట్ సంస్థ దక్కించుకుంది. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ వియ్యంకుడికి చెందినదే ఈ పిరమాల్ సంస్థ. అంబానీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సంబంధాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ‘104’ వాహనాల నిర్వహణ టెండర్‌ను 2016లో వక్రమార్గంలో పిరమాల్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయల బిల్లులు తీసుకుంది. ‘104 ’వాహనాలు ప్రభుత్వానివే, మందులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. వాహనాలకు డీజిల్, సిబ్బందికి వేతనాలకు గాను ఓక్కో వాహనానికి ప్రభుత్వం నెలకు రూ.2.44 లక్షలు చెల్లిస్తోంది. నిర్వహణ పేరిట ఈ సొమ్మంతా పిరమాల్ ఖాతాలోకే చేరుతోంది. కానీ, ఆ సంస్థ ఒక్కో వాహనం నిర్వహణకు నెలకు రూ.లక్ష కూడా ఖర్చు చేయడం లేదు. అంటే ఒక్కో వాహనం పేరిట అక్షరాలా రూ.1.44 లక్షలు జేబులో వేసుకుంటోంది. హైకోర్టు ఆదేశాలు బేఖాతర్ ఒక్కో వాహనానికి నెలకు రూ.2.44 లక్షల చొప్పున మూడేళ్లలో పిరమాల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.244 కోట్లు చెల్లించింది. 2019 మార్చి 31వ తేదీతో కాంట్రాక్టు కాలపరిమితి ముగియనుంది. ఈ సంస్థ పేదలకు సక్రమంగా మందులు ఇవ్వకున్నా, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎలాగూ గడువు ముగుస్తోంది కాబట్టి ఈలోగా టెండర్ ప్రక్రియ పూర్తిచేసి, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరో సంస్థకు వాహనాల నిర్వహణ కాంట్రాక్టు ఇవ్వాలని హైకోర్టు 2018 అక్టోబర్‌లో స్పష్టం చేసింది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టెండర్ ప్రక్రియను ప్రారంభించలేదు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేసింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ సాకుతో మళ్లీ పిరమాల్ సంస్థకే ‘104’ వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. దీని వెనుక ఉన్న లోగుట్టు ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ‘104’ అంబులెన్స్‌ల దుస్థితి ఇదీ... + రాష్ట్రంలో మెజారిటీ వాహనాలకు ఫిట్నెస్ లేదు. + ఇన్వర్టర్, బ్యాటరీలు లేవు. టైర్లు అరిగిపోయినా మార్చడం లేదు. + నెలలో 15,432 గ్రామాలకు వాహనాలు వెళ్లి మందులు ఇవ్వాలి. ఇందులో సగం గ్రామాలకు కూడా వాహనాలు వెళ్లడం లేదు. + కొన్ని వాహనాలు మరమ్మతులకు గురై షెడ్డుకే పరిమితం అయ్యాయి. కానీ, అవి గ్రామాల్లో తిరుగుతున్నట్టు చూపించి నెలకు రూ.2.44 లక్షల చొప్పున తీసుకుంటున్నారు. + 2018 ఆగస్ట్ నుంచి సిబ్బందికి ట్రావెలింగ్ అలవెన్సు, డిసెంబరు నుంచి డెయిలీ అలవెన్సు చెల్లించడం లేదు. + వాహనాలు మరమ్మతులకు గురైతే పట్టించుకోవడం లేదు. + వాహనంలో 60 రకాల మందులు ఉండాలి. కానీ, 27 రకాల మందులు కూడా ఉండడం లేదు. + గర్భిణులకు, మధుమేహ రోగులకు, మూర్ఛ సంబంధిత జబ్బులకు వాహనాల్లో మందులు లేవు. + ప్రతి వాహనానికి ఒక డాక్టరు ఉండాలి. కానీ, 60 శాతం వాహనాల్లో డాక్టర్లు లేరు. -
104 ఉద్యోగులపై వేటుకు సర్కార్ సిద్ధం!
సాక్షి, అమరావతి : 104 సంచార వైద్య శాలలు (చంద్రన్న సంచార చికిత్స) పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 104లో పనిచేస్తున్న 1642 మంది సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశారని, విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్టు సిబ్బంది ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారిపై వేటు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 25న వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్టు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 104 వాహనాల నిర్వహణను పిరమిల్ స్వాస్థ్య సంస్థ చూస్తోంది. ఈ సంస్థకు మూడేళ్ల వ్యవధికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. వచ్చే మార్చితో ఈ వ్యవధి ముగుస్తుంది. అప్పుడు తిరిగి టెండర్లు నిర్వహించి నిర్వహణ సంస్థతో పాటే సిబ్బందినీ మార్చాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉద్యోగులంతా 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 104 పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి పనిచేస్తున్నవారే. గత నాలుగున్నరేళ్లుగా 104 సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం, ప్రశ్నించినవారిని బదిలీ చేయడం, తొలగించడం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ గత కొంతకాలంగా సిబ్బంది పోరాడుతూనే ఉన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. మందులు అందక రోగుల ఇబ్బందులు ఈ నెల 22 నుంచి సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో 292 వాహనాలు గ్రామాలకు వెళ్లడం లేదు. దీంతో లక్షలాది మంది వృద్ధులు, గర్భిణులు, బాలింతలు మందులు అందక ఇబ్బందులు పడుతున్నారు. వీరేకాకుండా మధుమేహం, మూర్చ, రక్తపోటు, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులతో బాధపడుతున్న మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మందులు అందడం లేదు. దీంతో వారంతా అల్లాడుతున్నారు. కార్పొరేట్ సంస్థకు ఏడాదికి రూ.85.44 కోట్లు ప్రభుత్వం 104 సిబ్బందికి వేతనాలు సరిగా ఇవ్వకపోయినా, రోగులకు మందులివ్వకపోయినా తూతూమంత్రంగా వాహనాలను తిప్పుతున్న పిరమిల్ స్వాస్థ్య సంస్థకు మాత్రం ఏడాదికి రూ.85.44 కోట్లు చెల్లిస్తోంది. ఒక్కో వాహనానికి నెలకు రూ.2.44 లక్షలు ఇస్తోంది. అంటే నెలకు రూ.7.12 కోట్లకు పైగా చెల్లిస్తోంది. మూడేళ్ల కాంట్రాక్టులో భాగంగా నిర్వహణ సంస్థకు ప్రభుత్వం చెల్లించింది అక్షరాలా రూ.256.32 కోట్లు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా నిర్వహణ సంస్థకు మాత్రం భారీగా లబ్ధి చేకూర్చింది. చివరకు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించకుండా సంస్థ నిర్లక్ష్యం వహించినా సర్కారు పట్టించుకోకపోవడం వల్లే పోరాటాలకు దిగాల్సి వచ్చిందని సిబ్బంది చెబుతున్నారు. స్వయానా ముఖ్యమంత్రే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 104లో సిబ్బంది వివరాలు ఇలా.. కేడర్ ఉద్యోగుల సంఖ్య నర్సు/ఏఎన్ఎంలు 321 ఫార్మసిస్టులు 321 ల్యాబ్ టెక్నీషియన్లు 320 డ్రైవర్లు 326 వాచ్మెన్లు 165 డాక్టర్లు 189 -
చంద్ర గ్రహణం
నెల్లూరు(బారకాసు): నాలుగేళ్లు ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల వేళ తాయిలాలను ప్రకటిస్తున్న చంద్రబాబు సర్కార్ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవల కోసం అమలు చేస్తున్న సంచార చంద్రన్న వైద్యసేవను గాలికొదిలేసింది. ఈ సేవలు కింద పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం రెండేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన సైతం కరువైంది. దీంతో వారు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం నుంచి సమ్మెబాట పట్టనున్నారు. దీంతో సంచార వైద్యసేలకు బ్రేక్ పడనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామీణ ప్రజలకు సత్వర వైద్యసేలందించేలా 104 సేవలను ప్రవేశపెట్టారు. ఆయన హయాంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం వైద్యసేవలందేవి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రన్న సంచార సేవగా మార్పు చేసింది. పేరయితే ఘనంగా మార్పు చేసింది కాని ఆ దిశలో వైద్య సేవలందించడంలో పూర్తిగా విఫలమైంది. 104 వాహనాలకు సరిపడా మందులు సక్రమంగా ఇవ్వడంలేదు. పెట్రోల్, డీజిల్ ఖర్చులకూ డబ్బు మంజూరు చేయడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మరమ్మతులకు గురైతే వాహనాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని అంటున్నారు. 2008లో 104 పథకం హెచ్ఎంఆర్ఐ సంస్థ, 2011లో డీఎంహెచ్ఓ పరిధిలో నడిచింది. 2016 నుంచి పిరామిల్ స్వాస్థ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(పీఎస్‌ఎంఆర్‌ఐ) సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి సేవలు పేలవంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అనేకసార్లు అర్జీలు అందజేసినా ప్రభుత్వం సానుకూలస్పందన లేకపోవడంతో, గత్యంతరం లేక మరోమారు సిబ్బంది పోరుబాట పట్టనున్నారు. చంద్రన్న సంచార చికిత్స(104) కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) పిలుపు మేరకు మంగళవారం నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులకు సమ్మె నోటీసులను కూడా అందజేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 104 సంచార వాహనం ద్వారా అందే వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. జిల్లాలో మొత్తం 20 చంద్రన్న సంచార చికిత్స(104) వాహనాలున్నాయి. ఇందులో డ్రైవర్లు 22, ఫార్మాసిస్టులు 22, ల్యాబ్టెక్నీషియన్లు 20, ఎఎన్ఎంలు 22, వాచ్మెన్లు 7మంది ఉన్నారు. ప్రధాన డిమాండ్లు ఇవీ.. ♦ చంద్రన్న సంచార చికిత్స వాహన సేవలను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి. ♦ 2018 మే 1 నుంచి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రొసీడింగ్స్ ఆర్సీ నంబర్ 3918–సీఎస్సీ–2018 ప్రకారం వేతనాల నుంచి చట్టప్రకారం పీఎఫ్, ఈఎస్ఐకి ఉద్యోగస్తుని వాటా మాత్రమే మినహాయించి వేతనాలు చెల్లించాలి. ♦ పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా డైలీ ఫుడ్ అలవెన్స్ రూ.150కి పెంచాలి. ♦ 2/94 యాక్ట్‌ను సవరించి ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. రెగ్యులరైజేషన్లోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ♦ హెచ్ఎంవీ నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టిన డ్రైవర్లకు హెచ్ఎంవీ ప్రకారం వేతనం చెల్లించాలి. ♦ 11వ పీఆర్సీని ప్రారంభ తేదీ నుంచి వర్తింపజేయాలి. ♦ వాహనాల్లో మెరుగైన సేవల కోసం డేటాఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలి. ఈ ఔషధి వీహెచ్ఎన్డీ డేటా చేస్తున్న ఫార్మాసిస్ట్, నర్సులకు పీహెచ్సీలలో మాదిరిగా అదనపు పారితోషికం చెల్లించాలి. ♦ చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు ఆర్సీ, ఇన్సూరెన్స్, రోడ్‌ట్యాక్స్, ఫిట్నెస్ కల్పించి పూర్తి స్థాయిలో మరమ్మతులు నిర్వహించాలి. ♦ పీఎఫ్, ఈఎస్ఐలను సక్రమంగా అమలు చేయాలి. మహిళలకు 180రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ సౌకర్యం కల్పించాలి. ♦ కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయాలి. ♦ అక్రమ బదిలీలు, తొలగింపులు రద్దు చేయాలి. ♦ అన్ని పార్కింగ్ ప్రదేశాలలో వాచ్మెన్లను నియమించాలి. అదనపు పనిగంటలకు అదనపు పారితోషికం చెల్లించాలి. ♦ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏజెన్సీ అలవెన్స్ చెల్లించాలి. -
వైద్యమో చంద్రన్న
అదొక ‘రాజ’ యుగం. వైద్యం కోసం సంచార వైద్య వాహనాలు పల్లెబాట పట్టాయి. అడుగు తీసి అడుగు పెట్టలేని వృద్ధులకు, ఖర్చు పెట్టుకుని పట్టణాలకు వైద్యం కోసం రాలేని ధీనులకు ఠంచన్‌గా మందులు ఇచ్చి వైద్యం అందించిన వాహనాలు ఇప్పుడు పేరు మార్చుకుని వెళ్లనని మొండికేస్తున్నాయి. మందులు చాలక.. సేవలు అందించే శక్తి కోల్పోయిన వాహనాలు పల్లె మొహం చూపించలేక మూలనపడ్డాయి. ‘వైద్యమో చంద్రన్న’ అంటూ పల్లె రోగపీడితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. నెల్లూరు(బారకాసు): వైద్యులు.. సిబ్బంది కొరత.. చాలీచాలని మందులతో జిల్లాలో ‘చంద్రన్న సంచార వైద్యసేవలు’ అటకెక్కాయి. అధికారులు, నిర్వహణ సంస్థ పట్టించుకోకపోవడంతో పల్లె ప్రజలకు అరకొరగానే వైద్య సేవలు అందుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వరం వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 104 మొబైల్ వాహనాలకు శ్రీకారం చుట్టారు. పల్లెముంగిటకు వైద్యాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాన్ని అప్పట్లోనే హెచ్ఎంఆర్ఐ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. జిల్లాకు మొత్తం 20 వాహనాలను కేటాయించారు. వీటిలో వివిధ క్యాడర్లలో పనిచేసేందుకు అప్పట్లోనే ఔట్ సోర్సింగ్ కింద 127 మందిని నియమించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని 104 మొబైల్ వాహన వైద్య సేవలు అందేవి. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకం పేరును ‘చంద్రన్న సంచార చికిత్స’గా మార్చేసింది. వీటి నిర్వహణను ‘పిరమిడ్’ అనే సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో వైద్యసేవలు కుంటుపడుతూ వస్తున్నాయి. ఒక్కొక్క వాహనానికి వైద్యుడు, ల్యాబ్‌టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, స్టాఫ్‌నర్సు, డ్రైవర్ ఉండాలి. అదనంగా ముగ్గురు బఫర్ స్టాఫ్ ఉండాలి. వైద్యులు కూడా ఉండాలి. వైద్యుల్లో ఎవరైనా సెలవు పెడితే ఆ రోజు ఆ వాహనంలో వైద్యుడు లేకుండా ఉండే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ వాహనం వెళ్లిన ప్రాంతంలోని ప్రజలకు వైద్య సిబ్బంది వైద్యుడిగా వ్యవహరించాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. రక్తపరీక్షలు చేయడానికి కూడా అర్హత లేని సిబ్బందితో చేయిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు నెలకు సరిపడా ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం బీపీకి సంబంధించిన అటెనలాల్, గ్యాస్ట్రబుల్కు సంబంధించి మాత్రలు లేకపోవడంతో సంబంధిత రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ కొరత చంద్రన్న సంచార చికిత్స వాహనాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. ప్రతి జిల్లాకు ఒక కో–ఆర్డినేటర్‌ను ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా చంద్రన్న సంచార చికిత్సకు కూడా ఓ విశ్రాంత ప్రభుత్వ వైద్యుడిని నియమించింది. అయితే పిరమిడ్ సంస్థ కూడా నాన్‌మెడికల్ వ్యక్తిని జిల్లాలోని సంచార వాహనాలను చూసుకోవాలంటూ నియమించుకుంది. సంస్థ ప్రతినిధి ఆధిపత్యం చెలాయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని కో ఆర్డినేటర్ విధుల నుంచి తప్పుకున్నాడు. జిల్లా వైద్యారోగ్యశాఖ నుంచి చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి ఇన్చార్జి డీఐఓగా ఉన్న డాక్టర్ ఉమామహేశ్వరిని నోడల్ అధికారిగా నియమించారు. అయితే ఆమె ఏనాడు ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి చంద్రన్న సంచార చికిత్స సేవలు జిల్లాలో ఏ విధంగా అందుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం అనేక పనుల ఒత్తిడితో దీనిపై పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న ప్రతిసారి చంద్రన్న సంచార చికిత్స బాగా పనిచేస్తోందని నివేదిస్తున్నారని సమాచారం. ప్రజలకు సక్రమంగా వైద్యసేవలుఅందేలా చూస్తాం చంద్రన్న సంచార చికిత్స సేవలు మొబైల్ వాహనాల ద్వారా నిత్యం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు పిరమిడ్ సంస్థకు చెందిన మేనేజర్‌ను పిలిపించి విషయాలు తెలుసుకుంటున్నా. ఏమైనా సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశిస్తున్నా. ఏ మాత్రం నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా సమస్య ఉంటే తెలుసుకుని పరిశీలించి పరిష్కరిస్తా. – డాక్టర్ వరసుందరం, డీఎంహెచ్ఓ, నెల్లూరు -
బాబు బొమ్మ ఉంటే.. రైట్ రైట్..!
తాళ్లూరు: పేదల చెంతకే వైద్య సేవలు అనే ఉన్నత లక్ష్యంతో నడుస్తున్న చంద్రన్న సంచార చికిత్స వాహనాలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయి. ఆయా వాహనాల ద్వారా సంచార వైద్య సేవలు అందిస్తున్న పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలకు ఆయా సేవలు అందకపోగా, డొక్కు వాహనాలు ప్రమాదాలను తెచ్చిపెట్టేలా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆయా వాహనాల్లో సేవలందిస్తున్న ఉద్యోగులు భయపడుతున్నారు. చేసేది లేక ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. ♦ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇంటి వద్దనే వైద్య సేవలు అందించేందుకు 2008లో ‘104’ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో విజయవంతంగా కొనసాగిన ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు లబ్ధిపొందుతూ వచ్చారు. అనంతరం 2010లో డీఎస్సీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ (ఆర్ఓఆర్) జీఓ నంబర్ 3 ప్రకారం 104 వాహనాల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టి జీతాలు చెల్లించారు. 2014 వరకూ ఈ పథకం సక్రమంగానే సాగింది. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలకు పేర్ల మార్పులో భాగంగా 104 పథకానికి కూడా చంద్రన్న సంచార చికిత్స వాహనంగా పేరు మార్చారు. వీటి నిర్వహణను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలోకి మార్చి పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు సర్వీసు ప్రొవైడింగ్ బాధ్యతలు అప్పగించారు. అమలుకాని ఉత్తర్వులు... పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థకు సర్వీసు ప్రొవైడింగ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్రంలో 277 చంద్రన్న సంచార చికిత్స వాహనాలు ఉండగా, మన జిల్లాలో 20 వాహనాల ద్వారా సేవలు ప్రారంభించారు. వాటిలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లకు పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న మినిట్స్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) ప్రకారం ప్రభుత్వ కార్మిక చట్టాలు, అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చే ఆర్థికశాఖ ఉత్తర్వులు అమలు చేయాలి. కానీ, అవేమీ అమలు చేయడం లేదు. నాలుగేళ్లుగా మరమ్మతులకు నోచుకోని వాహనాలు... చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు ఇతర అన్ని వాహనాల మాదిరిగానే ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ట్యాక్స్, మరమ్మతులు చేయించాలి. కానీ, రాష్ట్రంలోని 277 వాహనాలకు నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్, ట్యాక్సులు, మరమ్మతులు లేవు. కనీసం జనరల్ చెకప్, మైనర్ మరమ్మతులు కూడా చేసిన దాఖలాలు లేవు. దీంతో ఆయా వాహనాలలో సీలింగ్ ఊడిపోయింది. లైట్లు పనిచేయక రోగులను పరీక్షించే సమయంలో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం బ్రేకులు కూడా సక్రమంగా పనిచేయని పరిస్థితి నెలకొనడంతో వాటిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రమాదాలు పొంచి ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల డ్రైవర్లకు జరిమానా... వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్తో పాటు ఇన్సూరెన్స్‌లు లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో వాహన డ్రైవర్లకు పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ జరిమానా విధిస్తోంది. ఏళ్ల తరబడి కనిపెట్టుకుని ఉన్న డ్రైవర్లపై జరిమానాలు విధిస్తుండటం సిబ్బందిని కలవరపెడుతోంది. జరిమానాలు విధించడంతో పాటు వాహనాలకు మరమ్మతులు చేయించకుండా ప్రమాదాలకు గురిచేయడంపై సిబ్బంది ఆందోళనకు సిద్ధమవుతున్నారు. నేటికీ ఉమ్మడి రిజిస్ట్రేషనే... రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లయినా చంద్రన్న సంచార చికిత్స వాహనాలు నేటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తోనే ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా ఫిట్నెస్ పరీక్షలు లేకపోవడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌పై తిరుగుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు మరమ్మతులతో పాటు ఫిట్నెస్ పరీక్షలు చేయించి బీమా సౌకర్యం కల్పించాలని, తద్వారా ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరిగితే ఇక్కట్లే... 104 వాహనాలలో ఉద్యోగ భద్రత ఉంటుందన్న ఆశతో 11 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,662 మంది డ్రైవర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. వారిలో జిల్లాలో 120 మంది వరకు పనిచేస్తున్నారు. అయితే, వాహనాలకు మరమ్మతులు చేయకపోవడంతో పాటు ఎంవీఐల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్‌లు లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఫిట్నెస్ గడువు పూర్తయి సామర్థ్య పరీక్షకు సమయానికి రాని వాహనాలకు రవాణాశాఖ రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తుంది. కానీ, ఈ వాహనాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు బొమ్మతో పాటు పేరు కూడా రాసుకుని తిరుగుతున్న వాహనాలు కావడంతో డొక్కు వాహనాలైనాగానీ రవాణా శాఖ అధికారులు ఆపే ధైర్యం చేయడం లేదు. -
'చంద్రన్న సంచార చికిత్స' సిబ్బంది అల్టిమేటం
హైదరాబాద్: 'చంద్రన్న సంచార చికిత్స' (104 సంచార వైద్యశాలలు)కు నిరసనల జ్వరం పట్టుకుంది. ఇటీవలే చంద్రన్న సంచార చికిత్స నిర్వహణ బాధ్యతలు తీసుకున్న పిరమిల్ స్వాస్థ్య సంస్థ బెదిరింపులకు, అక్రమ బదిలీలకు పాల్పడుతోందంటూ రాష్ట్రవ్యాప్తంగా 104 కాంట్రాక్టు ఉద్యోగులు నిరసనలు చేపట్టనున్నారు. దీని కోసం కార్యాచరణ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్-151 ప్రకారం సిబ్బందికి వేతనాల పెంపు, ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఫుడ్ అలవెన్స్ రూ.150 పెంపు, 104 పథకాన్ని చంద్రన్న సంచార చికిత్సగా మారుస్తున్నప్పుడు అందులోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫైనాన్స్ విభాగం ఇచ్చిన జీవోను వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైద్యాధికారుల కార్యాలయాల ఎదుట ధర్నా, అనంతరం సమ్మె నోటీసులు ఇస్తామని ఉద్యోగుల సంఘం తెలిపింది. దశల వారీగా ఊరూరా రోగులకు పరిస్థితి వివరించడం, ఎమ్మెల్యేలకు, ఎంపీలను కలిసి శాంతియుతంగా నిరసనలు తెలపడం వంటివి రోజువారీ కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. చంద్రన్న సంచార చికిత్సకు పూర్తిగా కేంద్రమే నిధులిస్తోంది. కాగా ఈ పథకానికి ఏపీ సీఎం చంద్రబాబు తన పేరు పెట్టుకున్నారు. అధికారుల మాట.. ఉద్యోగులు సమస్యలపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలవగా... మీ డిమాండ్లన్నీ జాతీయ ఆరోగ్యమిషన్‌కు చెబుతామని, వాళ్లే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. -
'నా పేరు పెట్టిన పథకాన్నే భ్రష్టు పట్టిస్తారా?'
-అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం -పేరు మార్చుకుని టెండర్ పొందిన 'బ్లాక్ లిస్ట్'లోని కంపెనీ -దీనిపై పిటిషన వేసిన మరో కంపెనీ -పిటిసనర్‌కు ఉన్నతాధికారుల బెదిరింపు ఫోన్లు -వారం రోజులుగా కోర్టు చుట్టూనే ఉన్నతాధికారులు హైదరాబాద్ : సంచార వైద్యశాలల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులపై మండిపడుతున్నారు. 104 పథకంగా ఉన్న దీన్ని ‘చంద్రన్న సంచార చికిత్స’గా పేరు మార్చి ఓ ప్రైవేటు సంస్థకు అప్పజెప్పిన నాలుగు రోజులకే కోర్టు తీవ్రంగా మందలించడం ముఖ్యమంత్రికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. నా పేరు పెట్టిన పథకాన్నే మీరు ఇలా భ్రష్టు పట్టిస్తారా అని ఉన్నతాధికారులతో అన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి ఆగ్రహించడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. టెండర్లలో జరిగిన అవినీతికి కోర్టుకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గత వారం రోజులుగా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులందరూ కోర్టు చుట్టూనే తిరుగుతున్నారు. బ్లాక్‌లిస్టులో పెట్టిన ఓ సంస్థ పేరు మార్చుకుని వస్తే దానికి మీరు టెండరు ఎలా ఇస్తారని కోర్టు తీవ్రంగా మండిపడింది. ఇప్పటికీ జీపీని సంప్రదించి ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో చెప్పాలని పలుసార్లు కోరినట్టు తెలిసింది. చంద్రబాబు జన్మదినం రోజున ప్రవేశపెట్టిన ‘చంద్రన్న సంచార చికిత్స’కు సంబంధించిన వాహనాలను సైతం ప్రైవేటు సంస్థ నుంచి తక్షణమే స్వాధీనం చేసుకోవాలని చెప్పడం అధికారుల్లో కలవరం మొదలైంది. పిటిషనర్‌కు ఉన్నతాధికారుల బెదిరింపులు 104 వాహనాల టెండర్లలో తీవ్ర అక్రమాలు జరిగాయని, బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీ నుంచి భారీగా ముడుపులు పొంది మళ్లీ దానికే ఇచ్చారని.. మరో కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన కోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘నీ పిటిషన్ ఉపసంహరించుకో. లేదంటే నీ అంతు చూస్తాం. మేము తల్చుకుంటే ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో నువ్వు ఏ టెండరూ వెయ్యలేవు. ప్రభుత్వంతో చెడు అవ్వద్దు. ప్రభుత్వంతో మంచిగా ఉంటే మరో టెండరైనా నీకు వచ్చేలా చేస్తాం’ అంటూ ఫోన్లో బెదిరించారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే పిటిషనర్ ఈ బెదిరింపులకు భయపడకుండా ‘మీరు బెదిరించిన విషయాన్ని కూడా కోర్టుకు చెబుతా’ అనడంతో అధికారులు వెనక్కు తగ్గారని సమాచారం. -
నేటి నుంచి చంద్రన్న సంచార చికిత్స
104 స్థానంలో ఉన్నట్టుండి తన పేరును చేర్చాలని సీఎం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రతి సేవకూ ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 104 వాహనాలకు తన పేరే పెట్టాలని నిర్ణయించారు. బుధవారం నుంచి ‘చంద్రన్న సంచార చికిత్స’ పేరుతో 104 వాహనాలను పల్లెలకు పంపించనున్నారు. మొన్నటివరకూ కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచిన ఈ పథకం 104 (సంచార వైద్యశాల) పేరు మార్చి పిరమిల్స్వాస్థ్య అనే ప్రైవేటు సంస్థకు అప్పజెప్పారు. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభిస్తారని ఆ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. దీనికి ముందుగా సంచార చికిత్స అనే పేరును ఖరారు చేశారు. ఉన్నట్టుండి సోమవారం విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో చంద్రన్న పేరును చేర్చాలని నిర్ణయించారు. దీనికి భారీగా ప్రచారం చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది. ఈ వాహనాలకు లేబులింగ్, స్టిక్కరింగ్ల పేరుతో భారీగా ఖర్చు చేశారు. ఏఎన్ఎంలే దిక్కు: వాస్తవానికి టెండరులో ఒక్కో వాహనానికి ఒక్కో స్టాఫ్ నర్సును నియమించాలి. కానీ జిల్లాకు ఒకరిద్దరు మాత్రమే స్టాఫ్‌నర్సులను నియమించి, మిగతా వాహనాలన్నిటికీ ఏఎన్ఎంలనే నియమించారు. గతంలో 104 వాహనాలకు ప్రత్యేక బడ్జెట్‌తో మందులు తెచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వాసుపత్రుల మందులనే ఇస్తున్నట్టు తేలింది. మళ్లీ పల్లెరోగులకు అరకొర మందులే దిక్కు కానున్నాయి.