'నా పేరు పెట్టిన పథకాన్నే భ్రష్టు పట్టిస్తారా?'
-అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం
-పేరు మార్చుకుని టెండర్ పొందిన 'బ్లాక్ లిస్ట్'లోని కంపెనీ
-దీనిపై పిటిషన వేసిన మరో కంపెనీ
-పిటిసనర్‌కు ఉన్నతాధికారుల బెదిరింపు ఫోన్‌లు
-వారం రోజులుగా కోర్టు చుట్టూనే ఉన్నతాధికారులు
హైదరాబాద్ : సంచార వైద్యశాలల నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులపై మండిపడుతున్నారు. 104 పథకంగా ఉన్న దీన్ని ‘చంద్రన్న సంచార చికిత్స’గా పేరు మార్చి ఓ ప్రైవేటు సంస్థకు అప్పజెప్పిన నాలుగు రోజులకే కోర్టు తీవ్రంగా మందలించడం ముఖ్యమంత్రికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. నా పేరు పెట్టిన పథకాన్నే మీరు ఇలా భ్రష్టు పట్టిస్తారా అని ఉన్నతాధికారులతో అన్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి ఆగ్రహించడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. టెండర్లలో జరిగిన అవినీతికి కోర్టుకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
గత వారం రోజులుగా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులందరూ కోర్టు చుట్టూనే తిరుగుతున్నారు. బ్లాక్‌లిస్టులో పెట్టిన ఓ సంస్థ పేరు మార్చుకుని వస్తే దానికి మీరు టెండరు ఎలా ఇస్తారని కోర్టు తీవ్రంగా మండిపడింది. ఇప్పటికీ జీపీని సంప్రదించి ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో చెప్పాలని పలుసార్లు కోరినట్టు తెలిసింది. చంద్రబాబు జన్మదినం రోజున ప్రవేశపెట్టిన ‘చంద్రన్న సంచార చికిత్స’కు సంబంధించిన వాహనాలను సైతం ప్రైవేటు సంస్థ నుంచి తక్షణమే స్వాధీనం చేసుకోవాలని చెప్పడం అధికారుల్లో కలవరం మొదలైంది.
పిటిషనర్‌కు ఉన్నతాధికారుల బెదిరింపులు
104 వాహనాల టెండర్లలో తీవ్ర అక్రమాలు జరిగాయని, బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీ నుంచి భారీగా ముడుపులు పొంది మళ్లీ దానికే ఇచ్చారని.. మరో కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన కోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘నీ పిటిషన్ ఉపసంహరించుకో. లేదంటే నీ అంతు చూస్తాం. మేము తల్చుకుంటే ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో నువ్వు ఏ టెండరూ వెయ్యలేవు. ప్రభుత్వంతో చెడు అవ్వద్దు. ప్రభుత్వంతో మంచిగా ఉంటే మరో టెండరైనా నీకు వచ్చేలా చేస్తాం’ అంటూ ఫోన్‌లో బెదిరించారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే పిటిషనర్ ఈ బెదిరింపులకు భయపడకుండా ‘మీరు బెదిరించిన విషయాన్ని కూడా కోర్టుకు చెబుతా’ అనడంతో అధికారులు వెనక్కు తగ్గారని సమాచారం.