చంద్రన్న సంచార చికిత్స వాహనం
అదొక ‘రాజ’ యుగం. వైద్యం కోసం సంచార వైద్య వాహనాలు పల్లెబాట పట్టాయి. అడుగు తీసి అడుగు పెట్టలేని వృద్ధులకు, ఖర్చు పెట్టుకుని పట్టణాలకు వైద్యం కోసం రాలేని ధీనులకు ఠంచన్‌గా మందులు ఇచ్చి వైద్యం అందించిన వాహనాలు ఇప్పుడు పేరు మార్చుకుని వెళ్లనని మొండికేస్తున్నాయి. మందులు చాలక.. సేవలు అందించే శక్తి కోల్పోయిన వాహనాలు పల్లె మొహం చూపించలేక మూలనపడ్డాయి. ‘వైద్యమో చంద్రన్న’ అంటూ పల్లె రోగపీడితులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
నెల్లూరు(బారకాసు): వైద్యులు.. సిబ్బంది కొరత.. చాలీచాలని మందులతో జిల్లాలో ‘చంద్రన్న సంచార వైద్యసేవలు’ అటకెక్కాయి. అధికారులు, నిర్వహణ సంస్థ పట్టించుకోకపోవడంతో పల్లె ప్రజలకు అరకొరగానే వైద్య సేవలు అందుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వరం వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 104 మొబైల్ వాహనాలకు శ్రీకారం చుట్టారు. పల్లెముంగిటకు వైద్యాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమాన్ని అప్పట్లోనే హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. జిల్లాకు మొత్తం 20 వాహనాలను కేటాయించారు. వీటిలో వివిధ క్యాడర్లలో పనిచేసేందుకు అప్పట్లోనే ఔట్ సోర్సింగ్ కింద 127 మందిని నియమించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని 104 మొబైల్ వాహన వైద్య సేవలు అందేవి.
ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకం పేరును ‘చంద్రన్న సంచార చికిత్స’గా మార్చేసింది. వీటి నిర్వహణను ‘పిరమిడ్’ అనే సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో వైద్యసేవలు కుంటుపడుతూ వస్తున్నాయి. ఒక్కొక్క వాహనానికి వైద్యుడు, ల్యాబ్‌టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, స్టాఫ్‌నర్సు, డ్రైవర్ ఉండాలి. అదనంగా ముగ్గురు బఫర్ స్టాఫ్ ఉండాలి. వైద్యులు కూడా ఉండాలి. వైద్యుల్లో ఎవరైనా సెలవు పెడితే ఆ రోజు ఆ వాహనంలో వైద్యుడు లేకుండా ఉండే పరిస్థితి నెలకొంది. దీంతో ఆ వాహనం వెళ్లిన ప్రాంతంలోని ప్రజలకు వైద్య సిబ్బంది వైద్యుడిగా వ్యవహరించాల్సి వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. రక్తపరీక్షలు చేయడానికి కూడా అర్హత లేని సిబ్బందితో చేయిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు నెలకు సరిపడా ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం బీపీకి సంబంధించిన అటెనలాల్, గ్యాస్ట్రబుల్‌కు సంబంధించి మాత్రలు లేకపోవడంతో సంబంధిత రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ కొరత
చంద్రన్న సంచార చికిత్స వాహనాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పర్యవేక్షించే నాథుడే కరువయ్యాడు. ప్రతి జిల్లాకు ఒక కో–ఆర్డినేటర్‌ను ప్రభుత్వం నియమించింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా చంద్రన్న సంచార చికిత్సకు కూడా ఓ విశ్రాంత ప్రభుత్వ వైద్యుడిని నియమించింది. అయితే పిరమిడ్ సంస్థ కూడా నాన్‌మెడికల్ వ్యక్తిని జిల్లాలోని సంచార వాహనాలను చూసుకోవాలంటూ నియమించుకుంది. సంస్థ ప్రతినిధి ఆధిపత్యం చెలాయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని కో ఆర్డినేటర్ విధుల నుంచి తప్పుకున్నాడు.
జిల్లా వైద్యారోగ్యశాఖ నుంచి చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి ఇన్‌చార్జి డీఐఓగా ఉన్న డాక్టర్ ఉమామహేశ్వరిని నోడల్ అధికారిగా నియమించారు. అయితే ఆమె ఏనాడు ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి చంద్రన్న సంచార చికిత్స సేవలు జిల్లాలో ఏ విధంగా అందుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. డీఎంహెచ్‌ఓ డాక్టర్ వరసుందరం అనేక పనుల ఒత్తిడితో దీనిపై పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న ప్రతిసారి చంద్రన్న సంచార చికిత్స బాగా పనిచేస్తోందని నివేదిస్తున్నారని సమాచారం.
ప్రజలకు సక్రమంగా వైద్యసేవలుఅందేలా చూస్తాం
చంద్రన్న సంచార చికిత్స సేవలు మొబైల్ వాహనాల ద్వారా నిత్యం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంపై ఎప్పటికప్పుడు పిరమిడ్ సంస్థకు చెందిన మేనేజర్‌ను పిలిపించి విషయాలు తెలుసుకుంటున్నా. ఏమైనా సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశిస్తున్నా. ఏ మాత్రం నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా సమస్య ఉంటే తెలుసుకుని పరిశీలించి పరిష్కరిస్తా.
– డాక్టర్ వరసుందరం, డీఎంహెచ్‌ఓ, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment