'చంద్రన్న సంచార చికిత్స' సిబ్బంది అల్టిమేటం
Published Tue, Sep 27 2016 3:34 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
హైదరాబాద్: 'చంద్రన్న సంచార చికిత్స' (104 సంచార వైద్యశాలలు)కు నిరసనల జ్వరం పట్టుకుంది. ఇటీవలే చంద్రన్న సంచార చికిత్స నిర్వహణ బాధ్యతలు తీసుకున్న పిరమిల్ స్వాస్థ్య సంస్థ బెదిరింపులకు, అక్రమ బదిలీలకు పాల్పడుతోందంటూ రాష్ట్రవ్యాప్తంగా 104 కాంట్రాక్టు ఉద్యోగులు నిరసనలు చేపట్టనున్నారు. దీని కోసం కార్యాచరణ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్-151 ప్రకారం సిబ్బందికి వేతనాల పెంపు, ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఫుడ్ అలవెన్స్ రూ.150 పెంపు, 104 పథకాన్ని చంద్రన్న సంచార చికిత్సగా మారుస్తున్నప్పుడు అందులోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఫైనాన్స్ విభాగం ఇచ్చిన జీవోను వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైద్యాధికారుల కార్యాలయాల ఎదుట ధర్నా, అనంతరం సమ్మె నోటీసులు ఇస్తామని ఉద్యోగుల సంఘం తెలిపింది. దశల వారీగా ఊరూరా రోగులకు పరిస్థితి వివరించడం, ఎమ్మెల్యేలకు, ఎంపీలను కలిసి శాంతియుతంగా నిరసనలు తెలపడం వంటివి రోజువారీ కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. చంద్రన్న సంచార చికిత్సకు పూర్తిగా కేంద్రమే నిధులిస్తోంది. కాగా ఈ పథకానికి ఏపీ సీఎం చంద్రబాబు తన పేరు పెట్టుకున్నారు.
అధికారుల మాట..
ఉద్యోగులు సమస్యలపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలవగా... మీ డిమాండ్లన్నీ జాతీయ ఆరోగ్యమిషన్‌కు చెబుతామని, వాళ్లే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
Advertisement
Advertisement