న్యూఢిల్లీ: రుణ పరిష్కార ప్రణాళికల్లో ఉన్న రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలుకి ప్రయివేట్ రంగ కంపెనీలు పిరమల్ గ్రూప్, జ్యూరిక్ ఇన్సూరెన్స్ ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు వీలుగా రెండు సంస్థలూ భాగస్వామ్య ప్రత్యేక సంస్థ(ఎస్‌పీవీ) ఏర్పాటు సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రుణ భారంతో కుదేలైన రిలయన్స్ క్యాపిటల్ దివాలా చట్ట(ఐబీసీ) చర్యలను ఎదుర్కొంటోంది. దీనిలో భాగంగా సాధారణ బీమా అనుబంధ సంస్థ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది.
ఇప్పటికే పిరమల్, జ్యూరిక్ విడిగా నాన్‌బైండింగ్ బిడ్స్ దాఖలు చేశాయి. రెండు సంస్థలూ ఏర్పాటు చేయనున్న ఎస్‌పీవీలో చెరి సగం(50 శాతం చొప్పున) వాటాలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ కోసం విడిగా బిడ్‌ను వేసినట్లు జ్యూరిక్ వెల్లడించింది. రిలయన్స్ సాధారణ బీమా బిజినెస్ విలువను పిరమల్ రూ. 3,600 కోట్లు, జ్యూరిక్ రూ. 3,700 కోట్లుగా మదింపు చేశా యి. అయితే అసలు విలువ రూ. 9,450 కోట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క రిలయన్స్ క్యాపిటల్ రుణ పరిష్కార ప్రణాళికను పర్యవేక్షిస్తున్న పాలనాధికారి, సీవోసీ బిడ్స్ దాఖలు గడువును అక్టోబర్ 30వరకూ పొడిగించాయి.
Comments
Please login to add a commentAdd a comment