పబ్లిసిటీ కోసం కాదు: అమీర్ ఖాన్
ముంబయి: తన తాజా చిత్రం 'పీకే' పోస్టర్‌పై నటుడు అమీర్ ఖాన్ స్పందించాడు. పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్‌ను విడుదల చేయలేదని ఆయన తెలిపాడు. సినిమా చూస్తేగానీ ఆ పోస్టర్ సినిమాలో ఎందుకుందో అర్థం అవుతుందని అమీర్ వ్యాఖ్యానించాడు. అమీర్ ఖాన్ ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా పోస్టర్‌ను శుక్రవారం పత్రికల్లో విడుదలైన విషయం తెలిసిందే. కళాత్మకమే తప్ప, అశ్లీలం కాదని అమీర్ పేర్కొన్నాడు.
కాగా పీకే పోస్టర్లో ఒక పాత టేప్ రికార్డర్ ను మాత్రమే అమీర్ అడ్డుపెట్టుకున్నాడు. దాంతో అమీర్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కోర్టులో కేసు నమోదైంది. అక్టోబర్ 15న ఈ కేసు విచారణ ఆరంభం కానుంది. మరోవైపు పీకే పోస్టర్‌ను మరో పోస్టర్ నుంచి కాపీ కొట్టారనే అంశం నేషనల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 1973 సంవత్సరంలో తన ఆల్బమ్ ప్రమోషన్ కోసం పోర్చుగీస్ సంగీత కారుడు క్విమ్ బారీయోరోస్ రూపొందించిన పోస్టర్ ను పోలీవుందని ఇంటర్నెట్ లో కథనాలు వెలువడ్డాయి.
క్విమ్ పోస్టర్ ను స్పూర్తిగా తీసుకుని పీకే పోస్టర్ రూపొందించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న 'పీ.కే.' సినిమాలో అమీర్ గ్రహాంతరవాసిగా కనిపించనున్నాడు. అమీర్ ఖాన్ తో పాటు ఈ చిత్రంలో సంజయ్ దత్, అనుష్కా శర్మ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ 15న విడుదల కానుంది.