ముగిసిన మహా కుంభాభిషేకం
పాలకొల్లు సెంట్రల్ : స్థానిక ఉమా క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం మహా కుంభాభిషేకం వైభవోపేతంగా ముగిసింది. కలశపూజ చేసిన పవిత్ర జలాలతో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ ఆలయ శిఖరానికి అభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత మహా కుంభాభిషేకం నిర్వహించడం రాష్ట్రంలో ఇదే ప్రథమమని అన్నారు. కుంభాభిషేకం వల్ల సమృద్ధిగా వర్షాలు పడి పాడిపంటలు తులతూగుతాయన్నారు. ఈవిధంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పూజా కార్యక్రమాలు జరి గితే రాష్ట్రం అభివృద్ధితో విరాజిల్లుతుందని అన్నారు. సుమారు పది వేల మంది భక్తులు కుంభాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణ, అవభృధస్నానము, శాంతి కల్యాణం, పంచ హారతులు, మహదాశీర్వచన, పండిత సత్కారం కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం చండీ ఉపాసకులు మాడుగుల శివశ్రీ శర్మ ప్రవచనం భక్తులను ఆకట్టుకుంది.