నగరంలో నిరసన ప్రదర్శన
సాక్షి, ముంబై: ఫొటో జర్నలిస్టుపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబుల్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ, ముంబై టీజేఏసీలు సంయుక్తంగా డిమాండ్ చేశాయి. దాదర్‌లోని ప్లాజా సినిమా సమీపంలో శనివారం ఈ రెండు సంస్థలు నిరసన సభను నిర్వహించాయి. నిందితులను అరెస్టు చేసి, వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని ఈ సందర్భంగా వక్తలు కోరారు. నిందితులకు కఠిన శిక్ష విధించాల న్నారు. అంతేకాకుండా బాధితురాలికయ్యే మొత్తం వైద్యఖర్చులను రాష్ట్రం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెండు సంఘాల కార్యకర్తలు నినాదాలు దేశారు. ఈ సభలో సొసైటీ అధ్యక్షురాలు బింగి అనూరాధ, మూల్నివాసి మాల, కె.నర్సింహగౌడ్, నాగ్‌సేన్‌మాల, కృష్ణ ఉదరి, వినాయక్ పద్మశాలి పాల్గొన్నారు.
అమితాబ్ దిగ్భాంతి
నగరంలో గురువారం సాయంత్రం ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి లోనుచేసిందని మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. ముంబై నగర పేరుప్రతిష్టలకు మచ్చగా నిలిచే ఇటువంటి ఘటనలు మున్ముందు జరగకుండా చూడాలన్నారు. వెంటనే నిందితులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రంగంలోకి ప్రెస్ కౌన్సిల్ బృందం
ఫొటో జర్నలిస్టు అత్యాచార ఘటనపై విచారణకోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) నియమించిన కమిటీ శనివారం రంగంలోకి దిగింది. తొలుత హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్ సత్యపాల్‌సింగ్‌లతో సమావేశమై సంప్రదింపులు జరిపింది. ఈ కేసుపై విచారణ జరిపేందుకు పీసీఐ అధ్యక్షుడు మార్కండేయ కట్జూ... రాజీవ్ సబడే నేతృత్వంలో కమిటీని నియమించారు.
ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జర్నలిస్టుల వివరణ తీసుకుని వీలైనంత త్వరగా తమకు నివేదించాలని ఆదేశించారు. ఈ మేరకు ముంబై మరాఠీపత్రకార్ సంఘ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
మళ్లీ విధులకు హాజరవుతా
‘అత్యాచారం జీవితానికి ముగింపు కాదని, నిందితులందరికీ కఠినశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు ముంబై నిర్భయ తెలిపిందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నిర్మలా సామంత్ ప్రభవాల్కర్ పేర్కొన్నారు. జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్న బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధితురాలు కోలుకుంటోందని తెలిపారు.