platinum jewelry
-
షేర్లను మించి పసిడి పరుగు తీస్తుంది!
న్యూయార్క్: గత ఆరు నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్న బంగారం ధరలు సమీప భవిష్యత్‌లోనూ మరింతగా మెరుస్తాయంటున్నారు సుప్రసిద్ధ స్విస్ ఇన్వెస్టర్ మార్క్ ఫేబర్. రెండు దశాబ్దాల క్రితం చమురు, ఇతర కమోడిటీలలో బుల్ రన్ రానుందంటూ ఖచ్చితమైన అంచనాలను ప్రకటించడంతో ఫేబర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులయ్యారు. కాగా.. ఇటీవల జోరు చూపుతున్న పసిడి ధరలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయని ఫేబర్ రూపొందించే గ్లూమ్ బూమ్ అండ్ డూమ్ తాజా నివేదిక ఊహిస్తోంది. నివేదికలో వివరాలు చూద్దాం.. ఈక్విటీలను మించి.. 2011- 2015 మధ్య కరెక్షన్ల తదుపరి 2015 డిసెంబర్ నుంచీ బంగారం ధరలు ర్యాలీ చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ పసిడి ధరలు డాలర్లలో చూస్తే 26 శాతం లాభపడ్డాయి. వెండి ధరలు మరింత అధికంగా 33 శాతం జంప్ చేశాయి. ఇందుకు ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలు కారణమవుతున్నాయి. యూఎస్ ఫెడ్ అనేకాకుండా యూరోపియన్ కేంద్ర బ్యాంకులు సైతం చౌక వడ్డీ రేట్లతో నిధులను వ్యవస్థలోకి విడుదల చేస్తున్నాయి. ఇవన్నీ పసిడి, వెండి ధరలకు జోష్ నిస్తున్నాయి. వెరసి కరెన్సీ విలువలు క్షీణించనున్నాయి. ఇది జరిగితే పసిడి ధరలు రాకెట్లా పరుగు తీస్తాయి. ఇటీవల పలు కేంద్ర బ్యాంకులు పసిడిలో కొనుగోళ్లను చేపడుతూ వస్తున్నాయి. ఈ అంశాలు ఇటీవల పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నమ్మకమైన పెట్టుబడి సమీప భవిష్యత్ లోనూ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు, కేంద్ర బ్యాంకులు బంగారంలో పెట్టుబడులను కొనసాగించే వీలుంది. యూఎస్ డాలరు భారీగా క్షీణించవచ్చని అంచనా వేస్తున్నాం. బంగారు ఆభరణాలకు సైతం కొంతమేర డిమాండ్ పెరిగే అవకాశముంది. ఈక్విటీలు, రుణ సాధనాలతో పోలిస్తే బంగారం మంచి రిటర్నులు ఇవ్వనుంది. 2000, 2015లలో కొద్ది సమయాలలో మినహాయిస్తే.. బంగారం, వెండి 2015 నుంచి భారీగా లాభపడ్డాయి. ఈ ఏడాది పలు అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే పసిడి మంచి పురోగతిని సాధించింది. పసిడితో పోలిస్తే ఇకపై వెండి, ప్లాటినం మరింత లాభపడేందుకు అవకాశముంది. వీటిలో ప్లాటినం మరింత బలపడవచ్చు. -
మహిళ హ్యాండ్‌బ్యాగ్‌లో నగలు, నగదు చోరీ
తమిళనాడు, తిరుత్తణి: తిరుత్తణి సుబ్రమణ్యస్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచిఉన్న మహిళా భక్తురాలి హ్యాండ్ బ్యాగులో రూ.మూడు లక్షల విలువైన ప్లాటినం నగలతో పాటు రూ.60 వేలు నగదు చోరీకి గురైన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరా బాదుకు చెందిన గీతారెడ్డి (38), ఆమె భర్త రాములురెడ్డితో పాటు కుటుంబసభ్యులు మొత్తం 15 మంది ఆదివారం సాయంత్రం తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయం చేరుకున్నారు. రాత్రి ఏడు గంటల సమయంలో సర్వదర్శన క్యూ ద్వారా స్వామిని దర్శించుకునేందుకు వెళుతుండగా భక్తుల రద్దీని ఆసరాగా చేసుకున్న దొంగలు చేతివాటం ప్రదర్శించి గీతారెడ్డి హ్యండ్ బ్యాగులో ఉంచిన రూ.మూడు లక్షలు విలువైనం ప్లాటినం నగలతో పాటు రూ. 60వేలు నగదు సైతం చోరీ చేశారు. కొంతసేపటి తరువాత హ్యండ్‌బ్యాగు తెరిచి ఉండడంతో ఆందోళన చెందిన మహిళ బ్యాగులో చూడగా నగలు, నగదు లేకపోవడంతో చోరీకి గురైనట్టు తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. దీనిపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు కొండ ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా భక్తుల్లో కలిసిపోయి వచ్చిన మహిళ బ్యాగు నుంచి నగలు, నగదు అపహరించి పక్కనే ఉన్న మరో ఇద్దరు పురుషులకు ఇవ్వడం గుర్తించారు. దుండగులను త్వరలోనే పట్టుకుని బాధితురాలి నగలు, నగదు తిరిగి అందజేస్తామని పోలీసులు తెలిపారు. -
గజదొంగ అరెస్ట్
రూ.3 కోట్లకు పైగా విలువ చేసే ఆభరణాలను చోరీచేసిన గజదొంగ బోయినశెట్టి దేవేంద్రను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఐజీ సంజయ్ బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల15న గుంటూరు జిల్లా బాపట్ల మండలం చిందుపల్లి గ్రామంలో జాస్తి సాంబశివరావు ఇంట్లోకి చొరబడిన దేవేంద్ర రూ.3 కోట్లకుపైగా విలువచేసే బంగారు ఆభరణాలు, వ్రజాలు, ప్లాటినం ఉంగరాన్నితస్కరించాడు. కేసు నమొదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దేవేంద్ర తో పాటు... దోచుకున్న బంగారాన్ని దాచిపెట్టే విషయంలో సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బంగారం విక్రయించడానికి మార్కెట్ ప్రాంతానికి వచ్చిన దేవేంద్రను అదుపులోకి తీసుకుని అతని నుంచి రూ 3 కోట్ల సొత్తును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దోచుకున్న సొత్తునంతా.. దాచిపెట్టిన దేవేంద్ర రూ60లక్షల విలువ చేసే ప్లాటినం ఉంగరాన్ని మాత్రం వెండిదనుకుని చేతికి పెట్టుకుని తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.